స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అరెస్ట్

కోకాపేట్ నివాసంలో అర్ధరాత్రి హైడ్రామా.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజేత,రాజేంద్రనగర్ :సభాపతి స్థానానికి, శాసనసభ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో నవీన్ రెడ్డి ప్రవర్తన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. స్పీకర్ పదవిని, ఆయన వ్యవస్థను అవమానించేలా మాట్లాడటంపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు, అర్ధరాత్రి దాటిన తర్వాత రాజేంద్రనగర్ నియోజకవర్గ గండిపేట్ మండల్ పరిధి కోకాపేట్‌లోని ఆయన నివాసంలో నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.కోకాపేట్‌లోని ఎమ్మెల్సీ నివాసానికి సోమవారం అర్ధరాత్రి దాటాక భారీగా చేరుకున్న పోలీసులు ఇల్లును ముట్టడించారు. అరెస్ట్ వార్త తెలిసి భారీగా చేరుకున్న అనుచరులు, కార్యకర్తలు పోలీసుల వాహనాలను అడ్డుకునేందుకు యత్నించడంతో కోకాపేట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తల నినాదాలు, ఆందోళనల మధ్యే నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అత్యంత గోప్యంగా ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.శాసనసభ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా చట్టపరమైన చర్యలు తప్పవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా నియోజకవర్గ వర్గాలు స్పష్టం చేశాయి. ఉదయం ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి, అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :