
దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన నిందితురాలు
లుకౌట్ నోటీసుల ఆధారంగా అదుపులోకి తీసుకున్న ఆర్జీఐఏ పోలీసులు
బాధితుల ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం, విజయవాడ పోలీసుల రంగప్రవేశం
విజేత,రాజేంద్రనగర్ : లండన్‌లో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు వల వేసి, రూ.కోట్లలో నక్కబొక్కలించిన కేటుగాళ్ల గుట్టు రట్టయింది. సోషల్ మీడియాలో కలరింగ్ ఇస్తూ యూట్యూబర్‌గా చలామణి అవుతున్న నందన పోలీసుల వలలో చిక్కింది. లండన్ ఉద్యోగాల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ కాగా, సోమవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన నందనను శంషాబాద్ (ఆర్జీఐఏ) ఎయిర్పోర్ట్ అధికారులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నందన, ఆమె భర్త కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడి విదేశీ ఉద్యోగాల పేరుతో పలువురి నుంచి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేశారు.లండన్‌లో ఉద్యోగం, చేతినిండా సంపాదన అంటూ చెప్పిన మాటలు నమ్మి అనేకమంది బాధితులు లక్షలాది రూపాయలు వీరి ఖాతాల్లో పోశారు. తీరా డబ్బులు తీసుకున్నాక జాబ్స్ ఇప్పించకపోగా, తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌తో పాటు విజయవాడలోనూ ఫిర్యాదులు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నందన దంపతులపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు (LOC) జారీ చేశారు. ఈ క్రమంలో దుబాయ్ నుంచి శంషాబాద్ ల్యాండ్ అయిన నందనను ఎమిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే ఆర్జీఐఏ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు.ప్రస్తుతం నందనను తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మరికొందరి వివరాలు, ఇప్పటికే కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులకు సైతం శంషాబాద్ పోలీసులు సమాచారం అందించారు. ఈ క్రేజీ ‘యూట్యూబర్ మోసాల చిట్టా’లో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఎంత మొత్తంలో డబ్బులు కాజేశారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.








