
– భక్తి గుండెల్లో ఉండాలి… సౌండ్ బాక్స్ లలో కాదు!.
– మండపాల వద్ద, ఊరేగింపులో డీజే ఉండాలా? వద్దా? అనే చర్చ జోరుగా.
విజేత, ఇబ్రహీంపట్నం :ఒకప్పుడు భక్తి అంటే.. గుడిలో గంటలు, భజనలు, కోలాహలం లేని ప్రశాంతత. కానీ నేడు పరిస్థితి మారింది. వినాయక చవితి, దసరా, బోనాలు, శివరాత్రి.. ఏ పండుగ వచ్చినా మండపాల ముందు 10, 20 సౌండ్ బాక్సులతో డీజే లు హోరెత్తుతున్నాయి. భక్తి ఉందా? శబ్ద కాలుష్యమా? అనే చర్చ నేడు సమాజంలో హాట్ టాపిక్ గా మారింది.
డీజే వల్ల లాభాలుగా కొందరి వాదన.
1. సాంప్రదాయ భజనలకు యువత రావడం లేదు, డీజే సౌండ్, లైటింగ్ ఉంటే యువత ఉత్సాహంగా మండపాల దగ్గరకు వస్తున్నారు.
2. నిశ్శబ్దం కంటే డ్యాన్సులు, పాటలతో పండుగ వాతావరణం కళకళలాడుతోంది, ఊరంతా ఒకే చోట చేరేలా చేస్తోంది.
3. చాలా మంది డీజే నిర్వాహకులు, సౌండ్ సిస్టమ్ వారికి ఇది ఒక ఉపాధి మార్గంగా మారింది.
కానీ డీజే వల్ల నష్టాలే ఎక్కువ – ఆందోళన కలిగించే అంశాలు:
1. భక్తి భావం మాయం :- భక్తి పాటకు బదులు సినిమా ఐటమ్ సాంగ్స్, డబుల్ మీనింగ్ పాటలు పెడుతున్నారు. దేవుడి ముందు భక్తితో నమస్కరించాల్సింది పోయి, మద్యం తాగి అసభ్యంగా డ్యాన్సులు చేసే పరిస్థితి వస్తోంది. దీనివల్ల పండుగ పవిత్రత దెబ్బతింటోంది.
2. ఘర్షణలకు దారి :- ఏ డీజే ముందు పెట్టాలి, ఏ సౌండ్ ఎక్కువ ఉండాలి అనే విషయంలో యువకుల మధ్య గొడవలు, కొట్లాటలు జరిగి పోలీసు కేసుల వరకు వెళ్తున్నాయి.
3. డబ్బు వృధా :- 10 రోజులు పూజ చేసి, చివరి రోజు నిమజ్జనం రోజు డీజే పేరుతో లక్షలు ఖర్చు పెడుతున్నారు. అదే డబ్బుతో గుడి అభివృద్ధి, పేద విద్యార్థులకు సహాయం చేస్తే పుణ్యం వస్తుందని పెద్దలు అంటున్నారు.
ప్రజల ఆరోగ్యంపై డీజే ప్రభావం – శబ్దం వెనుక దాగిన ప్రమాదం!.
క్షణిక ఆనందం కోసం పెట్టే ఈ పెద్ద సౌండ్ బాక్సులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనిషి 60 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని తట్టుకోగలడు. కానీ నేడు వాడుతున్న డీజే సౌండ్ సిస్టమ్స్ 120 నుండి 150 డెసిబెల్స్ శబ్దాన్ని వెదజల్లుతున్నాయి. ఇది ఒక జెట్ విమానం శబ్దంతో సమానం.
ఆరోగ్య సమస్యలు:
1. 120 డి.బి శబ్దాన్ని 10 నిమిషాల కంటే ఎక్కువ వింటే చెవిలోని సున్నితమైన నరాలు దెబ్బతింటాయి. తరచూ వింటే శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని ఈ.ఎన్.టి వైద్యులు చెబుతున్నారు.
2. భారీ శబ్దానికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. బీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి, వృద్ధులకు ఇది చాలా ప్రమాదం.
3. డీజే శబ్దం వల్ల ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. తీవ్ర తలనొప్పి, చిరాకు, నిద్ర పట్టకపోవడం, ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేరు.
4. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులకు అత్యంత ప్రమాదం, చిన్న పిల్లల్లో మెదడు ఎదుగుదలపై, గర్భిణీ స్త్రీల కడుపులోని శిశువుపై కూడా హాని కలుగుతుంది.
5. పెంపుడు జంతువులు, పక్షులు డీజే శబ్దానికి తీవ్ర భయానికి గురవుతున్నాయి.
వైద్యుల సూచన ఏమిటంటే “పండుగ చేసుకోండి, కానీ శబ్దాన్ని కాదు. బాక్స్ ల సంఖ్య తగ్గించండి, సౌండ్ తగ్గించండి. డీజే కి దూరంగా ఉండండి. ముఖ్యంగా చిన్న పిల్లలను, వృద్ధులను డీజే లకు దూరంగా ఉంచండి”

డీజే లపై చట్టపరమైన నిబంధనలు, శిక్షలు.
1. ప్రధాన చట్టం – నాయిస్ పొల్యూషన్ రూల్స్, 2000 (ఎన్విరాన్మెంట్ యాక్ట్, 1986 కింద) రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్, డీజే పూర్తిగా నిషేధం. పగటి పూట కూడా పోలీస్, కలెక్టర్ నుండి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి,
పండుగల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తేనే రాత్రి 12 వరకు మినహాయింపు.
2. నివాస ప్రాంతాల్లో పగలు 55 డి.బి, రాత్రి 45 డి.బి, సైలెన్స్ జోన్ (స్కూల్, హాస్పిటల్, కోర్టుకు 100 మీటర్ల పరిధి) లో పగలు 50 డి బి, రాత్రి 40 డి.బి ఉండాలని చట్టపర మైన షరతులు ఉన్నాయి.
3. ఎన్విరాన్మెంట్ యాక్ట్ – సెక్షన్ 15 ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు లేదా రూ. 1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ శిక్షలు పడొచ్చు. అనుమతి లేకుండా వాడితే రూ. 10,000 జరిమానా, పరికరాలు సీజ్ కూడ జరుగుతుంది. బిఎన్ఎస్ చట్టం కింద పబ్లిక్ న్యూసెన్స్ కేసులు నమోదు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
100 లేదా 112 కు కాల్ చేయండి, వీడియో సాక్ష్యం రికార్డ్ చేసి టీఎస్ పిసిబి కి ఫిర్యాదు చేయండి. డీజే తప్పు కాదు, దాన్ని వాడే విధానం తప్పు. భక్తి పాటలనే తక్కువ సౌండ్ తో పెట్టుకుని, సమయపాలన పాటిస్తే అది ఉత్సాహాన్నిస్తుంది. కానీ సినిమా పాటలు, భారీ శబ్దంతో భక్తిని వినోదంగా మార్చడం సరికాదు. భక్తిలో శబ్దం కంటే భావం ముఖ్యం.








