
విజేత,చొప్పదండి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు,బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుందే పిలుపు మేరకు చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీజేపీ నేతలు అరెస్టయ్యారు.కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మల్లేషం సైనీ ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్దకు చేరుకున్న బీజేపీ,బీజేవైఎం కార్యకర్తలను అసెంబ్లీ గేటు ముందు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సంగ నరేష్ మాట్లాడుతూ 40 లక్షల మంది విద్యార్థులకు సుమారు 15 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని మండిపడ్డారు.పై చదువుల కోసం వెళ్దామంటే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదు, అది విద్యార్థుల హక్కు అని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రీయింబర్స్ మెంట్ డబ్బులు విడుదల చేయాలని, లేని యెడల రానున్న రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీజేపీ,బీజేవైఎం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.








