అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలకు అడ్డుకట్ట

సైనిక్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీసులు

విజేత,చొప్పదండి: కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చొప్పదండి మండలంలోనిరుక్మాపూర్ గ్రామం లో ని సైనిక్ స్కూల్ లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సైబర్ క్రైమ్ ఎస్ఐ,చొప్పదండి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఆన్ లైన్ మోసాలు,ఓటీపీ మోసాలు,నకిలీ లింకులు, నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలు, యూపీఐ / బ్యాంకింగ్ మోసాలు,సైబర్ వేధింపులు,సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై వివరించారు.విద్యార్థులు తమ ఓటీపీ,పిన్ నంబర్,బ్యాంకు ఖాతా వివరాలు ఎవరికీ చెప్పవద్దని,అనుమానాస్పద లింకులను నొక్కవద్దని, సామాజిక మాధ్యమాలను బాధ్యతతో వాడాలని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచించారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే జాతీయ సైబర్ నేరాల సహాయక కేంద్రం 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని,జాతీయ సైబర్ నేరాల నివేదిక ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.