
విజేత,చేవెళ్ల: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం చేవెళ్లలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. ఇప్పుడు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








