ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్ లో దారుణ హత్య

కత్తులతో తెగబడిన ముఠా..సీసీటీవీలో రికార్డైన నరరూప రాక్షసత్వం

తోటి స్నేహితుడే కాలయముడిగా మారి ఓ వ్యక్తిని అతికిరాతకంగా కత్తులతో పొడిచి హత్య

విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ శాంతిభద్రతలకు నిలయంగా ఉండాల్సిన రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లి ఒక్కసారిగా రక్తసిక్తంగా మారింది. స్థానిక ‘హ్యాపీ హోమ్స్’ కాంప్లెక్స్‌లో గురువారం తీవ్ర కలకలం రేగింది. పాత కక్షలు, మాటమాట పెరగడంతో తోటి స్నేహితుడే కాలయముడిగా మారి ఓ వ్యక్తిని అతికిరాతకంగా కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. మృతుడు ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌లో నివాసముంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా కలిసి తిరుగుతున్న స్నేహితుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశంతో రగిలిపోయిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న వేటకత్తులతో బాధితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడికక్కడే విగతజీవుడిగా పడిపోయాడు. ఈ ఘోర కలికి సంబంధించిన దృశ్యాలు కాంప్లెక్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ వీడియోలు బయటకు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు ఈ దారుణ హత్య వెనుక డ్రగ్స్ మాఫియా లేదా మత్తు పదార్థాల విక్రయాల వ్యవహారం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. మృతుడితో పాటు హత్యకు పాల్పడిన నిందితులపై గతంలోనూ ఎన్‌డీపీఎస్ (NDPS – మత్తు పదార్థాల చట్టం) కింద కేసులు నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. డ్రగ్స్ దందాపై నిఘా పెట్టిన పోలీసులు, ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా స్నేహితుల మధ్య తలెత్తిన క్షణికావేశపు గొడవే ఈ హత్యకు దారితీసినట్లు భావిస్తున్నప్పటికీ.. దీనివెనుక ఉన్న అసలు దందాలు, పాత కక్షలపై రాజేంద్రనగర్ పోలీసులు సునిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.