సెంటిమెంట్ వర్సెస్ లీగల్ వార్

భాగ్యనగరంలో నిమజ్జన పంచాయతీ

హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఉద్రిక్తతలు

ట్యాంక్ బండ్ వైపు నోఛాన్స్

ఎన్టీఆర్ మార్క్, నక్లెస్ రోడ్డు వైపు అవకాశం

కోర్టు ఆదేశాలే కారణమంటున్న పోలీసులు

విజేత,తెలంగాణ ఎడిటర్: భాగ్యనగరంలో వినాయక నవరాత్రులు అంటేనే ప్రత్యేకం. ఇక్కడ నిమజ్జనోత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి జనం తరలివస్తుంటారు. వీటిని తిలకించేందుకు సుదూర ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తుంటారు. హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ వేదికగా జరిగే నిమజ్జనోత్సవం ఒక వేడుకలా జరుగుతోంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ నిమజ్జనోత్సవాలు వచ్చాయంటే చాలూ కోర్టు ఆదేశాలు, పోలీసుల ఆంక్షలు అంటూ హడావుడి నడుస్తోంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. సెంటిమెంట్ వర్సెస్ లీగల్ వార్ గట్టిగానే ఉంది. అటు కోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేక.. ఇటు భక్తుల సెంటిమెంట్ను సమ్మతించలేక తెలంగాణ పోలీసులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు.

హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఉద్రిక్తతలు..

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాల వేళ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. నిమజ్జనాలు చేయకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అయితే వాటిని భాగ్యనగర్ ఉత్సవ సమితి తొలగిస్తోంది. దీంతో అందరూ అసలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు చేయడం లేదని అుకుంటున్నారు. కానీ సాంకేతికంగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనాలు జరుగుతున్నాయి కానీ, ట్యాంక్ బండ్ ప్రధాన రోడ్డు వైపు మాత్రం అధికార యంత్రాంగం కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోంది.ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనాలను అడ్డుకోవడానికి ప్రధాన కారణం తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం వల్ల సరస్సు తీవ్రంగా కలుషితమవుతోందంటూ పర్యావరణవేత్తలు కోర్టులను ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానాలు.. సహజ సిద్ధమైన సరస్సులను కాపాడుకోవాలని, రసాయనాలు కలిసిన పీవోపీ విగ్రహాలను సాగర్ మధ్యలోకి నేరుగా వేయకూడదని తేల్చిచెప్పాయి. కేవలం మట్టి విగ్రహాలను లేదా సహజ రంగులు వాడిన ప్రతిమలను మాత్రమే అనుమతించాలని, నిమజ్జనం అనంతరం వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశాలు ఇచ్చాయి.

హైడ్రా ప్రత్యేక ప్రకటన..

వినాయక చవితి ముందు నుంచే నిమజ్జనోత్సవాలకు సంబంధించి అనేక రకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా హైడ్రా నిమజ్జనోత్సవాలకు అడ్డంకిగా నిలుస్తోంది అంటూ విమర్శలు వచ్చాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా నిమజ్జనోత్సాలకు అడ్డంకి కాదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు పోలీసులు కేవలం ట్యాంక్ బండ్ వైపు మాత్రమే నిమజ్జనాలను అడ్డుకుంటున్నారు. హుస్సేన్‌సాగర్‌లోని ఒక భాగాన్ని ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, పీవీ మార్గ్ వైపు సాంకేతిక వెసులుబాట్లతో నిమజ్జనాలకు ఉపయోగిస్తున్నారు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు రోడ్లు వెడల్పుగా ఉండటం, భారీ హైడ్రాలిక్ క్రేన్లు నిలపడానికి తగినంత స్థలం ఉండటం, కృత్రిమ చెరువులు అందుబాటులో ఉండటంతో పాటు క్రేన్ల ద్వారా నిమజ్జనం చేసిన వెంటనే వ్యర్థాలను వెలికితీయడానికి అనువుగా ఉంటుంది. కానీ ట్యాంక్ బండ్ వైపు అలా కాకుండా, ఇటీవల కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టి ఫుట్‌పాత్‌లు, గ్రానైట్ టైల్స్, చారిత్రక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అక్కడ భారీ క్రేన్లు నిలిపి వేలాది వాహనాలను అనుమతిస్తే ట్రాఫిక్ స్తంభించడమే కాకుండా, నగర ప్రధాన రహదారి ధ్వంసమవుతుందన్నది పోలీసుల వాదన.

తీవ్ర ఆవేదనలో భక్తులు..

చట్టపరమైన ఆదేశాల పేరుతో నిమజ్జనోత్సవాలను అడ్డుకోవడం తగదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి భక్తుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. దశాబ్దాలుగా ట్యాంక్ బండ్ ప్రధాన రహదారి మీదుగానే వినాయకుల ఊరేగింపులు సాగాయని, ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమని వారు వాదిస్తున్నారు. ట్యాంక్ బండ్ వైపు బారికేడ్లు కట్టి భక్తులను పూర్తిగా నిలువరించడం హిందూ సంప్రదాయాలను అడ్డుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థాన ఆదేశాలను ఉల్లంఘించలేక, అటు భక్తుల ఆగ్రహాన్ని చల్లార్చలేక ప్రతి ఏటా ట్యాంక్ బండ్ వేదికగా ఈ సెంటిమెంట్ వర్సెస్ లీగల్ వార్ నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంది.