సేవాభావం గొప్పదే.. పరిసరాల పరిశుభ్రత కూడా ముఖ్యమే!

– ఆకలితో ఉన్న అభాగ్యులకు అన్నదానం అభినందనీయం.. కానీ ఎంగిలి ప్లేట్లతో రైల్వే స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రం

– భోజనం పెట్టిన తర్వాత బాధ్యత మరిస్తే ఎలా..? ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకునేదెవరు?

విజేత, కాజీపేట ప్రతినిధి: ఆకలితో అలమటించే అభాగ్యులకు పట్టెడన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి ఉండదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేని వృద్ధులు, దిక్కులేని వారు, వికలాంగులకు ఆపన్నహస్తం అందిస్తూ వారి ఆకలి తీర్చడం నిజంగా అభినందించదగ్గ విషయం. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మిగిలిపోయే ఆహారాన్ని వృథా చేయకుండా సేకరించి, కాజీపేట రైల్వే జంక్షన్ వద్ద ఉన్న నిరుపేదలకు అందిస్తున్న వారి సేవా కార్యక్రమం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తున్న ఈ ప్రయత్నం మరింత మందికి ఆదర్శంగా నిలవాల్సిందే.అయితే ఈ మంచి కార్యక్రమం వెనుక మరో సమస్య ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందిస్తున్న నిర్వాహకులు, భోజనం పంపిణీ పూర్తయిన తర్వాత అక్కడే మిగిలిపోతున్న ఎంగిలి ప్లేట్లు, ఉపయోగించిన నీటి గ్లాసులను తొలగించడంపై మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోజనం చేసిన వారు ప్లేట్లు, గ్లాసులను ఎక్కడపడితే అక్కడ వదిలేసి వెళ్లిపోతుండటంతో రైల్వే స్టేషన్ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాల కారణంగా దుర్వాసన వెదజల్లుతూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తోంది.నూతన హంగులతో అభివృద్ధి చెందుతున్న కాజీపేట రైల్వే జంక్షన్‌కు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎంగిలి ప్లేట్లు, నీటి గ్లాసులు పేరుకుపోయి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయాల్సిన పారిశుద్ధ్య సిబ్బంది, మున్సిపల్ కార్మికులు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

 *సేవలోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి!* 

నిస్సహాయుల ఆకలి తీర్చాలనే ఆలోచన ఎంత గొప్పదో, వారికి భోజనం అందించిన ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే బాధ్యత కూడా అంతే ముఖ్యమని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఆహారం పంపిణీ చేసే నిర్వాహకులు అక్కడ తగినన్ని డస్ట్‌బిన్లు ఏర్పాటు చేయడంతో పాటు, భోజనం చేసిన వారు ఎంగిలి ప్లేట్లు, నీటి గ్లాసులను వాటిలోనే వేసేలా అవగాహన కల్పించాలని కోరుతున్నారు. అవసరమైతే భోజన పంపిణీ పూర్తయ్యాక పరిసరాలను శుభ్రం చేసే బాధ్యతను కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Views: 13

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :