విజేత  బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలకు రాజుపేటలో కూలిన బ్రిడ్జి

హెచ్చరిక బోర్డ్ లేక తృటిలో తప్పిన ప్రమాదం..

అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు

విజేత, ములకలపల్లి: ములకలపల్లి మండల పరిధిలోని రాజుపేట వద్ద భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి కూలిపోయిన ప్రదేశంలో అధికారులు ఎలాంటి హెచ్చరిక సూచనలు, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదకర పరిస్థితి నెలకొంది.ఇదే క్రమంలో బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక సూచనలు లేకపోవడంతో ఓ ఆటో వాహనదారుడు వేగంగా అక్కడికి వచ్చాడు. ప్రమాదకర పరిస్థితిని గమనించిన గ్రామస్తులు వెంటనే కేకలు వేయడంతో అప్రమత్తమైన ఆటో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్రామస్తులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం చోటుచేసుకోలేదని స్థానికులు తెలిపారు.బ్రిడ్జి కూలిపోయిన విషయం తెలిసినా అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరిక చర్యలు చేపట్టకపోవడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో, వర్షాల సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.