సేవలు ‘కట్’.. వేడుకలు ‘స్టార్ట్’

వ్యాధికి మందు లేదు.. వేడుకలకు కొదవలేదు!

రెబ్బెన ఆసుపత్రిలో బాధ్యతారాహిత్యం!

విజేత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో చీఫ్: ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదలకు ప్రాణం పోసే దేవాలయం అనుకుంటే.. అది కాస్తా ఇప్పుడు ‘కేక్ కటింగ్’ పాయింట్‌గా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని రెబ్బన మండలంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మారిపోయింది. రోగులు క్యూ కట్టి వైద్యం కోసం వేచి చూస్తుంటే, అటువైపు కన్నెత్తి చూడాల్సిన సిబ్బంది మాత్రం బర్త్‌డే కేక్‌ల ముందు ‘బిజీబిజీ’గా ఉన్నారు. రెబ్బెన ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం ‘రోగికి వైద్యం’ కంటే ‘సిబ్బందికి సంబరం’ మిన్న అనే నిజాన్ని మరోసారి చాటిచెప్పింది. ఆసుపత్రిలో రోగుల ప్రాణాల కోసం అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది, పుట్టినరోజు కేక్‌లను కట్ చేస్తూ, ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంతో హుషారుగా కనిపిస్తున్నారు. ఆసుపత్రిలోని వైద్య పరికరాల మధ్య జరగాల్సిన ఈ ‘కేక్ కటింగ్’ పండగను చూస్తుంటే, రోగులకు చికిత్స అందించడం కంటే ఈ వేడుకలే ముఖ్యమనే అభిప్రాయం కలుగుతోంది. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన వారు, ఇలాంటి ‘తీపి’ పనులతో బిజీగా ఉంటే.. ఇక రోగుల గతేంటో ఆ భగవంతుడికే తెలియాలి! బాధ్యత గాలికి వదిలేసి, ఆసుపత్రిని పార్టీ హాలుగా మార్చేసిన ఈ ‘వైద్య’ వీరులపై ఉన్నతాధికారులు ఎలాంటి ‘చేదు’ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.