
– ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక పరిశీలన
– రోగులకు నాణ్యమైన వైద్యం, పౌష్టికాహారం అందించాలి
– రోగుల సంక్షేమమే లక్ష్యం.. ఆసుపత్రి అభివృద్ధికి కృషి: రాగమయి
విజేత, సత్తుపల్లి: పట్టణంలోని నూతన ప్రభుత్వ ఆసుపత్రిని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ బుధవారం పరిశీలించారు. సత్తుపల్లి హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ నాయక్, ఆసుపత్రి డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులతో కలిసి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు.గతంలో సింగరేణి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి అందించిన వైద్య పరీక్ష పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారంతో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. ఆసుపత్రిలో మరిన్ని సదుపాయాల కల్పనకు అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సూచించారు. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం పెంచాలని కాంట్రాక్టర్, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఎమ్మెల్యే రాగమయి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఎదుర్కొంటున్న సమస్యలపై రోగులతో మాట్లాడారు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన మరిన్ని సదుపాయాలు కల్పించేలా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే మరింత అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.









