
ముఖ్య అతిథిగా ప్రత్యేక పూజా లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
విజేత,రాజేంద్రనగర్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కిస్మత్‌పూర్ సాయిబాబా నగర్ కాలనీ శ్రీ సాయి గణపతి దేవాలయంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. ఈ మహోత్సవానికి రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కు ఆలయ కమిటీ ప్రతినిధులు,కాలనీవాసులుస్థానిక నాయకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి జరిగిన ప్రత్యేక అభిషేకాలు, పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.పూజాదికాల అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో గురువు స్థానం అత్యున్నతమైనదని, గురు బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకాలని అన్నారు. గురు పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున సాయిబాబా దివ్య సమక్షంలో పూజల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. సాయిబాబా ఆశీస్సులతో రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చింతన మనుషుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు మరియు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని వేడుకలను జయప్రదం చేశారు. భక్తుల కొలహలంతో ఆలయ ప్రాంగణం “సాయి నాథునికి జై” నినాదాలతో మారుమోగింది.






