
ఉపాధ్యాయుడిగా మారిన జిల్లా కలెక్టర్
– విద్యార్థుల కు కలెక్టర్ ‘క్లాస్’
– తరిగొప్పుల కేజీబీవీలో గంటపాటు గణితం, ఆంగ్లం బోధించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
– మార్కులు ముఖ్యం కాదు.. విషయ పరిజ్ఞానమే ముఖ్యం
– విద్యార్థులకు కలెక్టర్ హితబోధ
విజేత,తరిగొప్పుల /జనగామ : ఆయన జిల్లా మొత్తాన్ని శాసించే అత్యున్నత పరిపాలనాధికారి.. నిరంతరం సమీక్షలు, పర్యటనలతో బిజీగా ఉండే కలెక్టర్. కానీ శనివారం ఆయన ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా మారిపోయారు. చేతిలో చాక్ పీస్ పట్టి, బ్లాక్ బోర్డుపై లెక్కలు రాస్తూ, ఇంగ్లీష్ వ్యాకరణం నేర్పిస్తూ విద్యార్థులతో మమేకమయ్యారు. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలను పరిశీలించిన ఆయన, స్వయంగా క్లాస్ రూమ్‌లోకి వెళ్లి విద్యార్థులకు ఉపాధ్యాయుడిగా మారిపోయారు.సుమారు గంటసేపు విద్యార్థులకు గణితం,ఆంగ్లం సబ్జెక్టులపై ఆయనే స్వయంగా బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఒక నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడిలా క్లాస్ తీసుకున్నారు.
ఆ రెండు సబ్జెక్టులపై పట్టుంటేనే ఉజ్వల భవిష్యత్తు
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశ నుంచే గణితం,ఆంగ్ల భాషలపై పట్టు సాధించాలని పిలుపునిచ్చారు.ఈ రెండు సబ్జెక్టులలో ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. ప్రస్తుత ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, అందుకే విద్యార్థులంతా డిజిటల్ లెర్నింగ్ వైపు మొగ్గు చూపాలని, డిజిటల్ విద్యపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
మార్కుల వేట వద్దు.. నాలెడ్జ్ ముఖ్యం
చదువులో కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే ప్రాకులాడటం సరికాదని కలెక్టర్ విద్యార్థులకు హితబోధ చేశారు.పరీక్షల్లో ఎన్ని మార్కులు సాధించామనే దానికంటే చదువుకున్న చదువుపై ఎంతవరకు విషయ అవగాహన, పరిజ్ఞానం సంపాదించామనేదే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.విద్యార్థుల్లో సబ్జెక్టుపై సరైన అవగాహన, నాలెడ్జ్ ఉంటే భవిష్యత్తులో ఎదురయ్యే ఎంతటి పెద్ద సమస్యలనైనా చాలా సులభంగా పరిష్కరించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ స్వయంగా తమకు క్లాస్ రూమ్‌లో పాఠాలు బోధించడంతో కేజీబీవీ విద్యార్థినులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. తమ సందేహాలను ఎంతో ఓపికగా తీర్చిన కలెక్టర్‌కు విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి కలెక్టర్ అయ్యానని చెప్పి విద్యార్థులో ప్రభుత్వ పాఠశాలల పై నమ్మకం కలిగించేలా స్పూర్తి నింపారు.అనంతరం విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించాలని ఉపాద్యాయులకు సూచించి, విద్యార్థులకు పుస్తకాలు, బెడ్ షీట్స్, యూనిఫారం లు అందించారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో గౌసియా బేగం, ఏంఈవో జానకి, తహసీల్దార్ మోసిన్, పాఠశాల ఎస్వో సునీత మరియు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.






