
రూ.2.43 కోట్లతో కోటవురట్లలో కేజీబీవీ,ట్రెజరీ నూతన భవనాల ప్రారంభం
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి అనిత
విజేత, కోటవురట్ల, నక్కపల్లి: రాష్ట్రంలో పేద కుటుంబాలకు వరంలా “తల్లికి వందనం” వంటి పథకాలు నిలుస్తాయని రాష్ట్ర హోం,విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నియోజకవర్గంలోని కోటవురట్ల మండల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి కోటవురట్లలో రూ.2.43 కోట్ల విలువగల పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఇందులో భాగంగా హోం మంత్రి అనిత ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి కోటవురట్ల మండల కేంద్రంలో సమగ్ర శిక్షా నిధులతో రూ.168.03 లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఫైనాన్స్ నిధులతో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించిన ట్రెజరీ కార్యాలయం నూతన భవనాన్ని ప్రారంభించారు.అనంతరం ఆమె కోటవురట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. హోం మంత్రి అనిత రాక సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి అనిత వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. తమ ప్రభుత్వ పాలన ఆరంభంలోనే ఒకేసారి 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో భవిష్యత్తులో అనేక కొత్త పరిశ్రమలు రానుండగా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రతిభావంతుల ఫోటోలను పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి “తల్లికి వందనం” పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. పవిత్ర గుడిలాంటి బడిలో ప్రైవేట్ ఫంక్షన్లు ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే గంజాయి సమూల నిర్మూలనతో పాటు సైబర్ నేరాలపై ఉక్కు పాదం మోపుతామని తెలిపారు.మండల కేంద్రం కోటవురట్ల జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద బస్సు స్టాండ్ ఏర్పాటు చేయడంతో పాటు అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు రెండు బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటానని హోం మంత్రి హామీ ఇచ్చారు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మమేకం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర పురోగతి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచే ప్రారంభమవుతుందన్నారు.పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం దృష్టి పెట్టాలని, పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులు బాధ్యతగా చదువుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లపిల్లలకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా తల్లిదండ్రులు వారిని తీర్చిద్దాలని సూచించారు.ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హోం మంత్రి అనిత విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు,అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీ నాయుడు,మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెట్ల లింగన్న నాయుడు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు జానకి శ్రీను, పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షులు చించలపు ప్రదీప్, పట్టణ శాఖ అధ్యక్షులు యాళ్ల వరహాలు బాబు సహా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

*(జీవి రమణ – ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)*


