
విజేత,చిలకలూరిపేట : పట్టణంలోని గుర్రాలచావిడి జెండా చెట్టు సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రఫీ అనే వ్యక్తి మద్యం మత్తులో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో సుమారు 10 గంటల సమయంలో ఉరివేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన అతని భార్య వెంటనే ఇంటి యజమాని షేక్ గౌస్ బాషాకు సమాచారం అందించింది. దీంతో రఫీని అడ్డుకునేందుకు వెళ్లిన ఇంటి యజమానిన మద్యం మత్తులో ఉన్న రఫీ కిందకు తోసివేశాడు. అనంతరం పక్కనే ఉన్న అద్దం ముక్కతో గౌస్ బాషా తలపై, పొట్టపై పొడవడంతో ఆయనకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన బంధువులు గాయపడిన గౌస్ బాషాను స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు ఆయనను గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (GGH) రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.








