రాష్ట్రంలో మూతపడుతున్న జూట్ పరిశ్రమలు..28కి గాను నడుస్తున్నవి 4..

– అవి కూడా ఉత్తరాంధ్రలోనే..

– వీధినపడిన వేలాది కుటుంబాలు

– నిర్వహణభారంతో చేతులెత్తేసిన యాజమాన్యాలు

– ప్రేక్షక పాత్రలో ప్రభుత్వాలు

విజేత, ఏపీ ఎడిటర్ అనిల్ కుమార్ : ఏపీలో జూట్ పరిశ్రమలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లేవి. కానీ రానురాను తిరోగమనంలో పడ్డాయి. వరుసగా మూతపడుతూ వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఒకటి రెండు పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా అతి కష్టమ్మీద నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాల ప్రోత్సాహం కరువవ్వడం, ముడిసరుకులు దొరకకపోవడం, ఆపై పరిశ్రమల నిర్వహణ భారం కావడంతో యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. అటు గోగు పంటసాగు కూడా పడిపోయింది. దీంతో గోగును దిగుమతి చేసుకొని ఉత్పత్తి అంటే ఇబ్బందికరమే. అందుకే ఒక్కో పరిశ్రమ మూతపడుతూ వస్తోంది. ఒకటి, అరా మాత్రమే ఇప్పుడు పరిశ్రమలు నిర్వహణలో ఉన్నాయి.

*వేలాది మంది ఉపాధికి దూరం..* 

జూట్‌ పరిశ్రమ కుదేలవుతోంది. ఒక్కో పరిశ్రమ మూతపడుతూ వస్తోంది. రాష్ట్రంలో 28 పరిశ్రమలకుగాను ఇప్పటికే 24 మూతపడ్డాయి నాలుగు మాత్రమే నడుస్తున్నాయి.ఈ పరిశ్రమలు సైతం ఉత్తరాంధ్రలోనే నడుస్తుండడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా జూట్‌ మిల్లుల్లో 50 వేల మంది ఉపాధి పొందేవారు. క్రమేపీ పరిశ్రమలు మూతపడడంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఉన్న పరిశ్రమలు అతికష్టమ్మీద నిర్వహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలే పరిశ్రమల మూతకు ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ముడిసరుకుల ధరలు భారీగా పెరడటం, జనుము పంట తగ్గడం, ప్లాస్టిక్‌ వినియోగం పెరగడం, జూట్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ లేకపోవడం తదితర కారణాలతో ఈ పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. విద్యుత్‌ రాయితీలు, రుణాల రూపంలో ప్రోత్సాహకాలు లేకపోవడం కూడా ఒక కారణం.

*గణనీయంగా తగ్గిన సాగు..* 

గోగు పంటలు లేక పరిశ్రమల యజమాన్యాలు నానా అవస్థలు పడుతున్నాయి. పశ్చిమబంగ, రాజస్థాన్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల నుంచి గోగు నార తీసుకువచ్చి పరిశ్రమలు నడిపించాల్సిన పరిస్థితి దాపురించింది. గతంలో మన రాష్ట్రంలోని రైతులే పూర్తిస్థాయిలో గోగు ఉత్పత్తి చేసేవారు. అప్పట్లో రైతులకు గిట్టుబాటు ఉండేది. తర్వాత రోజుల్లో గోగు పండించాలంటే రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విత్తనాల సేకరణ నుంచి గోగు ఊరపెట్టడం, నారతీయటం వంటి పనులు చేపట్టడం రైతులకు కష్టమే అయినా వాటిని అధిగమించి పండించేవారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ముందుకు రావడంలేదు. ఈ ఏడాది గోగునారకు మంచి ధర పలికినా రైతులు పూర్తిస్థాయిలో పంట వేయలేదు. క్వింటాల్‌ రూ.12వేలు వరకు పలికింది.

*జాడలేని జూట్ కార్పొరేషన్* 

గోగు పంటను కొనుగోలు చేయడానికి జూట్‌ కార్పొరేషన్‌ వారు ముందుకు వచ్చేవారు. అయితే జూట్‌ కార్పొరేషన్‌ ఇప్పుడు మూలకు చేరింది. అప్పట్లో నియమించిన సిబ్బంది పదవీ విరమణ చేశాక కొత్త వారిని నియమించలేదు. గతంలో జూట్‌ కార్పొరేషన్‌ అధికారులు వ్యవసాయశాఖ అధికారుల సహకారంతో గోగు పంటపై రైతులకు అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ విషయమై మండల వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తే జూట్‌ కార్పొరేషన్‌ అధికారుల జాడే కనిపించలేదని అంటున్నారు.