
విజేత,విశాఖపట్టణం బ్యూరో: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడు కేవలం మాటలకే పరిమితం కాకుండా, కళ్లముందే నిజమై కనిపిస్తోంది. ఒకప్పుడు సాధారణంగా ఉన్న రహదారులు నేడు విశాలమైన నేషనల్ హైవేలుగా మారుతుంటే, ఏళ్ల తరబడి ఖాళీగా పడి ఉన్న భూములు ఇప్పుడు పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో సాగిన పాఠశాలలు డిజిటల్ తరగతులుగా రూపాంతరం చెందుతున్నాయి. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఆధునిక వసతులతో ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రతి రంగంలోనూ వస్తున్న ఈ మార్పులు రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజలకు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.ఈ ప్రగతికి సాగరతీర నగరం విశాఖపట్నం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో ఎన్నో ఆకర్షణీయమైన ప్రకటనలు వచ్చినప్పటికీ, ఆచరణలో అనుకున్నంత పురోగతి కనిపించలేదు. కానీ ఇప్పుడు విశాఖ నగరం కొత్త రూపు దిద్దుకుంటోంది. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టులతో పాటు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో వైజాగ్ ప్రాంతం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. ప్రకటనల స్థానంలో క్షేత్రస్థాయి ఫలితాలు కనిపిస్తుండటంతో నగర రూపురేఖలు వేగంగా మారుతున్నాయి.పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు వేగంగా లభిస్తుండటంతో పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు. భూముల కేటాయింపు నుంచి పనుల ప్రారంభం వరకు ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనివల్ల నిన్నటివరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలు కార్పొరేట్ ఆఫీసులు, పరిశ్రమలతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువత.. మళ్లీ సొంత రాష్ట్రానికే తిరిగి వచ్చి ఉద్యోగాలు సాధించే వాతావరణం నెలకొంటోంది.కేవలం పెద్ద ప్రాజెక్టులే కాకుండా విద్య, నైపుణ్య శిక్షణ, తీర ప్రాంతాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.ఐటీఐల ఆధునీకరణ, నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సముద్ర తీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ మత్స్యకారుల సంక్షేమం నుంచి విదేశీ ఎగుమతుల వరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ఈ పురోగతి కేవలం ఒక నినాదం కాదు.. అది నిర్మిస్తున్న రహదారులు, తీర్చిదిద్దుతున్న తరగతి గదులు, యువతకు లభిస్తున్న ఉద్యోగాల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, వేగవంతమైన పనులతో రాష్ట్రం వికాస బాటలో వేగంగా అడుగులు వేస్తోంది.




