కుర్చీ కోసం రాజకీయమా..? ప్రజల కోసం పాలనా..?

కుర్చీ కోసం రాజకీయమా..? ప్రజల కోసం పాలనా..?

రాజకీయాలు మారుతున్నాయా..?

లేక రాజకీయ నాయకుల మాటలే మారుతున్నాయా..?

ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజలే ప్రభువులు. ఓటు అడిగే సమయంలో ప్రతి ఇంటి గడపా పవిత్రమే. ప్రతి ఓటరూ అమూల్యమే. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అదే ప్రజల సమస్యలు ఎందుకు అజెండాలో చివరి వరుసకు చేరుతున్నాయి..? ఇది నేటి రాజకీయాలను చూస్తున్న సామాన్యుడి మనసులో మెదులుతున్న ప్రశ్న.దేశ రాజకీయాల్లో అధికార పక్షం–ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభలో ఆందోళనలు, బయట విమర్శలు… ఇవన్నీ ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ ప్రజల కోసం జరగాల్సిన రాజకీయ పోరాటం.. పదవుల కోసం జరిగే పోరాటంగా మారితే మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్టే!ప్రజలు ఓటు వేసేది నాయకుల గొడవలు చూడటానికి కాదు.తమ జీవితాల్లో మార్పు చూడటానికి!

యువతకు ఉద్యోగం కావాలి.రైతుకు గిట్టుబాటు ధర కావాలి.పేదవాడికి నాణ్యమైన వైద్యం కావాలి.విద్యార్థికి మంచి విద్య కావాలి.మధ్యతరగతి కుటుంబానికి ధరల భారం తగ్గాలి.

ఇవి రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలో మాత్రమే కనిపించే పదాలు కాకూడదు. ప్రభుత్వ నిర్ణయాల్లో, బడ్జెట్లలో, అమలులో కనిపించాలి.ఒక పార్టీ అధికారంలో ఉంటే ప్రశ్నించే గొంతును శత్రువుగా చూడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రశ్నిస్తే ప్రతి ప్రశ్నను రాజకీయ కుట్రగా కొట్టిపారేయకూడదు.ప్రశ్నించే ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి అవసరం.సమాధానం చెప్పే ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి బలం.అలాగే ప్రతిపక్షం కూడా బాధ్యత మరిచిపోకూడదు. ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగిస్తే అసలు ప్రజా సమస్యల గొంతు నొక్కుకుపోతుంది.ఇక సోషల్ మీడియా రాజకీయాలు మరో కొత్త మలుపు తీసుకున్నాయి. నిజం కంటే ప్రచారం వేగంగా పరిగెడుతోంది. ఒక పార్టీ అనుకూల వార్త క్షణాల్లో వేల మందికి చేరుతోంది. అదే సమయంలో నిర్ధారణ లేని ఆరోపణ కూడా నిజంలా మారే ప్రమాదం ఉంది.

ఒక్క క్లిక్‌తో వార్త పుడుతోంది…ఒక్క షేర్‌తో అపోహ పెరుగుతోంది…ఒక్క అబద్ధంతో ప్రజాభిప్రాయం ప్రభావితం అయ్యే పరిస్థితి వస్తోంది!

అందుకే రాజకీయ పార్టీలకే కాదు… మీడియాకు, సోషల్ మీడియా వినియోగదారులకు, ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉంది.ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం మాత్రమే కాదు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజల హక్కు.ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పడం పాలకుల బాధ్యత.ప్రజల తరఫున ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత.నిజాన్ని ప్రజల ముందుంచడం మీడియా బాధ్యత.

అధికారం ఎవరి చేతిలో ఉన్నా ప్రజలే యజమానులు అన్న సత్యాన్ని మరచిపోకూడదు.ఎందుకంటే…

పదవి తాత్కాలికం.అధికారం అశాశ్వతం.రాజకీయ జెండాలు మారుతాయి.కానీ ప్రజల తీర్పు మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది!

అందుకే రాజకీయ నాయకులకు ఒక చిన్న విజ్ఞప్తి…ప్రజల ఓట్లతో కుర్చీలో కూర్చొని ప్రజలనే మర్చిపోవద్దు.రాజకీయాలు చేయండి…కానీ ప్రజల కోసం చేయండి.విమర్శించండి…కానీ ఆధారాలతో చేయండి.పోరాడండి…కానీ ప్రజా సమస్యల కోసం పోరాడండి.అధికారం సాధించండి…కానీ అధికారం ప్రజలదేనన్న స్పృహను కోల్పోవద్దు.ఎన్నికల్లో గెలిచేది ఒక పార్టీ కావచ్చు…కానీ పాలనలో గెలవాల్సింది ప్రజలే!

అదే నిజమైన ప్రజాస్వామ్యం.అదే ప్రజల విజయం.

అదే అక్షర ఆత్మగోష! — ఎడిటర్ వాయిస్

డా. బి, అనిల్ కుమార్, చైర్మన్ అండ్ చీఫ్ ఎడిటర్

7702866885