
విజేత,పరిగి : పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ . జిల్లా & సెషన్స్ జడ్జి , వికారాబాద్ ప్రదీప్ నాయక్ ఈరోజు, 23.09.2026న తీర్పు వెలువరించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, తెలిపారు.పరిగి మండలం చిట్యాల్ గ్రామానికి చెందిన బ్యాగరి కమల (35), ఆశా వర్కర్, భర్త మృతి చెందడంతో తన కుమార్తెతో కలిసి నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన రావులగల్ల దేవదాసు అలియాస్ దాసు (36) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే కొన్ని కారణాల వల్ల గత మూడేళ్లుగా తన ఇంటికి రావద్దని కమల అతడిని వారించింది. అయినప్పటికీ నిందితుడు తరచూ మద్యం సేవించి ఆమె ఇంటికి వచ్చి గొడవపడేవాడు. ఈ క్రమంలో 12.09.2016 రాత్రి నిందితుడు మద్యం మత్తులో కమల ఇంటికి వెళ్లి ఆమెతో మళ్లీ గొడవ పడ్డాడు. అనంతరం కక్ష పెంచుకున్న దేవదాసు, కమల శరీరంపై కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించాడు. మంటలు అంటుకున్న కమల గట్టిగా కేకలు వేస్తూ నిందితుడి వైపు పరిగెత్తడంతో అతడికి కూడా మంటలు అంటుకు న్నాయి. తీవ్రంగా గాయపడిన కమలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ 14.09.2016న మృతి చెందింది. కేసు రికార్డుల్లో కూడా కమలకు నిప్పంటించిన ఘటన, ఆమెను చికిత్స నిమిత్తం తరలించడం, అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిన విషయాలు నమోదు చేయబడ్డాయి.ఈ ఘటనపై పరిగి పోలీస్ స్టేషన్‌లో సీఆర్ నెం.216/2016, యూ /ఎస్ 302 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, వైద్యపరమైన ఆధారాలు, సంఘటనకు సంబంధించిన వస్తువులు మరియు ఇతర సాక్ష్యాలను సేకరించి న్యాయ స్థానంలో సమర్పించారు. కేసు ఛార్జ్‌షీట్‌లో నిందితుడిగా రావులగల్ల దేవదాసు, తండ్రి మొగులయ్య, వయస్సు 36 సంవత్సరాలు, వృత్తి వ్యవసా యం, చిట్యాల గ్రామం, పరిగి మండలంగా నమోదు చేశారు.ఈ కేసులో వై,నాగేష్, ఎస్ ఐ, పరిగి పోలీస్ స్టేషన్ మరియు పి . ప్రసాద్, సి ఐ పి దర్యాప్తు అధికారులుగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం పరిగి సర్కిల్ సి ఐ పి కొండల్ రెడ్డి మరియు పరిగి ఎస్ హెచ్ ఓ బి . మోహన్ కృష్ణ, ఎస్ ఐ పి కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో సహకరించారు. కేసు ప్రాసిక్యూషన్ మరియు ట్రయల్ ప్రక్రియలో మెరాజ్ ఫిర్దౌస్, అడిషనల్ . పీపీ , పీసీ పి . జగన్మోహన్ రెడ్డి, 10038, సీడి ఓ , పరిగి పోలీస్ స్టేషన్, పీసీ ఏ . రాజేష్, 99104 మరియు పీసీ ఎస్ . నిరంజన్ గౌడ్, 5598, బ్రీఫింగ్ & లియసన్ ఆఫీసర్ , మొదటి ఎ డి జె కోర్ట్ సమన్వయంతో సహకరించారు.కేసులో సమర్పించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు ఇతర సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించి, రావులగల్ల దేవదాసుకు జీవిత ఖైదు శిక్ష మరియు 1,00,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది..ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, మాట్లాడుతూ, నేరాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తు, నాణ్యమైన సాక్ష్యాల సేకరణ మరియు ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ద్వారా నిందితులకు చట్టపరమైన శిక్ష పడేలా వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఇట్టి కేసులో పని చేసిన అధికారులకు జిల్లా ఎస్పీ అబినందించడం జరిగింది.








