
ఏపీలో అక్రమంగా పశు రవాణా
అన్నివేళ్లు ఉత్తరాంధ్ర వైపే..
వారపు సంతల నుంచి కర్కశంగా తరలింపు
ఇదో మాఫియాగా మారిన వైనం
విజేత, అమరావతి బ్యూరో : అక్రమ వ్యాపారాలకు అడ్డూ అదుపూ లేదు. మంచి చెడ్డా విచక్షణ లేదు. చివరకు పాడి పశువులను వధించి సొమ్ము చేసుకుంటున్నారు. గో హత్య మహాపాపం అని తెలిసినా.. విచక్షణ మరిచి మరీ దానిని ఒక లాభసాటి వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పశువులు పట్టుబడినా దాని మూలాలు ఉత్తరాంధ్ర వైపే చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలల కిందట పోలీస్ రాష్ట్ర ఉన్నతాధికారులు పశువుల రవాణాపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. కొంతవరకూ కట్టడిచేసే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు రావడంతో వారు కఠినంగా వ్యవహరించారు. దీంతో ఎక్కడికక్కడే పశువులు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. ఇప్పుడు తనిఖీలు నిలిచిపోవడంతో.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్న మాదిరిగా మళ్లీ యథాస్థితికి వచ్చింది. పశువుల అక్రమ రవాణా, గోవధలు యథేచ్ఛగా సాగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వారపు సంతల నుంచి..
ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 10కిపైగా వారపు సంతలు ఉన్నాయి. అక్కడే పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. వాటి దగ్గర నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆవులను కేరళలోని వధశాలలకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశాలోని గిరిజన ప్రాంతాల నుంచి ఆవులను కాలినడకన వారపు సంతలకు తీసుకొచ్చి రూ.10వేలకు, రూ.25వేలకు అక్రమ రవాణా ముఠాకు విక్రయిస్తారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి కేరళకు తరలిస్తున్న ముఠా ఆటను పోలీసులు, రవాణా శాఖ అధికారులు కట్టిస్తుండటంతో రైతుల ముసుగులో తరలిస్తున్నారు.పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్టు అయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చునే వెసులబాటు ఉండాలి. ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహారం వేయడం లేదు. దీంతో ఆకలికి, దప్పికతో అలమటించే పశువులు మార్గమధ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా యంత్రాంగం నిద్రపోతోంది.
కర్కశంగా కుక్కేసి..
అడ్డగోలుగా పశురవాణా జరుగుతోంది. సాధారణంగా 15-20 పట్టే వాహనాల్లో 60 నుంచి 70 పశువులను ఎక్కిస్తున్నారు. కేరళ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన తరువాత అవి గమ్యానికి చేరినట్టే. అక్కడ పశువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు లేవు. ఇక్కడి పశు మాంసానికి అరబ్ దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. దేశీయంగా కిలో పశుమాంసం రూ.250 నుంచి రూ.450 పలుకుతోంది. కానీ అరబ్ దేశాల్లో రూ.6 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన పశువులను వధించి పోర్టులు, ఇతరత్రా అక్రమ మార్గాల్లో అరబ్ దేశాలకు చేరుతున్నట్టు తెలుస్తోంది.విశాఖ, కాకినాడ, గొల్లప్రోలు, కత్తిపూడి, రాజమండ్రి, నూజివీడు ప్రాంతాలకు బలహీనంగా ఉన్న పశువులను తరలిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వాటిని చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాలకు తరలిస్తారు.మరి ఆరోగ్యంగా ఉన్న పశువులను ఇతర దేశాలకు తరలించేందుకు ఆసక్తిచూపిస్తుంటారు.








