– కేజీహెచ్ లో అన్నీ సమస్యలే

– ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రికి సుస్తి

– వేధిస్తున్న సిబ్బంది కొరత

– ప్రజలకు అరకొరగా వైద్యసేవలు

– వేలాది మంది రోగులకు తప్పని ఇబ్బందులు

విజేత, ఏపీ ఎడిటర్ అనిల్ కుమార్: కింగ్ జార్జి అస్పత్రి..ముద్దుగా ఉత్తరాంధ్ర ప్రజలు పెద్దాస్పత్రిగా పిలుచుకుంటారు. ఒక్క ఉత్తరాంధ్ర మాత్రమే కాదు. పక్కనే ఉన్న ఒడిశా, చత్తీస్ గడ్ ల నుంచి సైతం రోగులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది రోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తూ ఉంటుంది కేజీహెచ్. కానీ పెరుగుతున్న రోగులకు తగ్గట్టు మాత్రం వసతులు సమకూరడం లేదు. వైద్యసేవలు మెరుగుపడం లేదు. దీంతో రోగులకు ఎదురవుతున్నఇబ్బందులు అన్నీఇన్నీ కావు. వందేళ్ల చరిత్ర ఈ ఆస్పత్రి సొంతం.రోజుకు సగటున 3,500 నుంచి నాలుగు వేల మధ్య ఓపీ ఉంటుంది. ఇన్‌పేషెంట్లు మరో రెండు వేల మంది ఉంటారు. అయితే రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్యులు లేరు. ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నా ప్రయోజనం లేకుండా పోతోందని అధికారులు చెబుతున్నారు. గత వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా ఉండేది. కూటమి వచ్చిన తరువాత గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది.

*రెట్టింపు సిబ్బంది నియమిస్తేనే..* 

అత్యవసర, అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని కేజీహెచ్ కు రిఫర్ చేస్తుంటారు. కేజీహెచ్‌లో సుమారు 40 విభాగాలతో సేవలు అందిస్తున్నారు. ఆంధ్ర మెడికల్‌ కళాశాల/కేజీహెచ్‌కు స్పెషాలిటీ విభాగాల్లో 67 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 57 మంది ఉన్నారు. పది ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో రెండేసి, ఆప్తమాలజీ, జనరల్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, సర్జికల్‌ అంకాలజీ విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్‌ పోస్టు చొప్పున ఖాళీగా ఉన్నాయి. అలాగే, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 60 మంజూరు కాగా, మూడు ఖాళీలు ఉన్నాయి. ఆప్తమాలజీ, జనరల్‌ సర్జరీలో ఈ ఖాళీ ఉన్నాయి. 181 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 165 మంది ఉన్నారు. మరో 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డెర్మటాలజీ, కార్డియో థొరాసిక్‌ సర్జరీ విభాగాల్లో నాలుగేసి, పీడియాట్రిక్‌ సర్జరీలో రెండు, ఈఎన్‌టీ, కార్డియాలజీ, పీడియాట్రిక్స్‌, న్యూరో సర్జరీ, యూరాలజీ, మెడికల్‌ అంకాలజీ విభాగాల్లో ఒక్కొక్క అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు ఖాళీగా ఉన్నాయి. అలాగే, నాన్‌ క్లినికల్‌ విభాగానికి సంబంధించి 16 ప్రొఫెసర్‌ పోస్టులు మంజూరుకాగా, మూడు ఖాళీ ఉన్నాయి. బయోకెమిస్ర్టీ, పెథాలజీ, ఫోరెన్సిక్‌ డిపార్టుమెంట్‌లో ఒక్కొక్క పోస్టు చొప్పన ఖాళీ ఉన్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 22 మంజూరు కాగా, మూడు ఖాళీ ఉన్నాయి. ఫోరెన్సిక్‌ మెడిసిన్‌లో రెండు, బయో కెమిస్ర్టీలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. అలాగే, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 74 మంజూరుకాగా, ఆరు ఖాళీలు ఉన్నాయి. అనాటమీలో మూడు, బయో కెమిస్ర్టీలో రెండు, మైక్రోబయాలజీలో ఒక పోస్టు ఖాళీగా ఉంది.ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఇంకా రోజుకు సుమారు 200 వరకు మేజర్‌, మైనర్‌ శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంతోపాటు అదనపు పోస్టులను మంజూరుచేయాల్సి ఉంది. మరో 150 పోస్టులను మంజూరుచేస్తే, రోగులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా రోగుల తాకిడి పెరుగుతున్నందున కొన్ని విభాగాల్లో అదనపు యూనిట్లు ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌ ఉంది. దానిపై కూడా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.

*ఆక్సిజన్ ప్లాంట్లపై నిర్లక్ష్యం..* 

కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఆక్సిజన్‌ పెద్దఎత్తున అవసరం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటుచేశాయి. ఈ క్రమంలోనే కేజీహెచ్‌లో ఆరు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇందుకోసం సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటి ద్వారా వందల సంఖ్యలో పడకలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఆక్సిజన్‌ నిత్యం అవసరమవుతుంది. ముఖ్యంగా ఐసీయూ, ఎన్‌ఐసీయూతోపాటు ఇతర అత్యవసర విభాగాల్లోని రోగులకు ఆక్సిజన్‌ అందించాల్సి ఉంటుంది. ఇందుకు ఆస్పత్రిలోని ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉపయోగపడతాయి. కాకపోతే విద్యుత్‌ వినియోగం కాస్త ఎక్కువ అవుతుంది. ఈ కారణాన్ని చూపించి అధికారులు ఆక్సిజన్‌ ప్లాంట్లను నిర్లక్ష్యం చేసినట్టు చెబుతున్నారు.