
– మార్కెట్ యార్డ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ.
– ఇది 1000 రోజుల పాలన కాదు.. వెయ్యి రోజుల ప్రజా పీడన అంటూ మంచిరెడ్డి ద్వయం ఫైర్.
విజేత, ఇబ్రహీంపట్నం : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వారం రోజుల పాటు చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పోరుబాట’ కార్యక్రమం ఇబ్రహీంపట్నంలో హోరెత్తింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఉదయం ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా “420 అడుగుల కాంగ్రెస్ 420 హామీల భారీ ఫ్లెక్సీని” ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) పాల్గొన్నారు. వారితో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మహిళా నాయకురాళ్లు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మార్కెట్ యార్డు నుండి చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చిన అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 1000 రోజులు కావస్తోంది. ఇది 1000 రోజుల పాలన కాదు, వెయ్యి రోజుల ప్రజా పీడన. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసింది. రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు 2500, తులం బంగారం, స్కూటీలు ఏవీ ఇవ్వలేదు” అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలోనే కాకుండా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం వల్ల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ప్రజా సమస్యలు పట్టించుకునే నాథుడే లేడు” అని విమర్శించారు, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజా క్షేత్రంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కారణంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను వివరించి, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ ప్రజలకు చేరవేసేలా ప్రసంగించారు.









