
*రాజేంద్రనగర్ సర్కిల్‌లో చెరువు నిబంధనలకు పాతర*
*ప్రైవేట్ వెంచర్ల కోసం జీహెచ్‌ఎంసీ అధికారుల ‘ప్రత్యేక’ తాపత్రయం*
విజేత,రాజేంద్రనగర్ : చెరువుల పరిరక్షణే ధ్యేయమంటూ కాగితాల్లో చట్టాలు వల్లించే అధికారులు, క్షేత్రస్థాయిలో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద మోకరిల్లుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గంధంగూడ డివిజన్ కొత్త చెరువు సర్వే నంబర్ 66 వద్ద జీహెచ్‌ఎంసీ చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ (యుజిడి) పనులే ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిబంధనలను నట్టేట ముంచుతూ సాగుతున్న ఈ పనుల వెనుక పెద్ద ఎత్తున ‘ప్రైవేట్’ లబ్ధి దాగి ఉందనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
చెరువు నిబంధనలు ‘నీటి పాలు
సాధారణంగా చెరువుల ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు కానీ, తవ్వకాలు కానీ చేయడానికి వీల్లేదు. కానీ, కొత్త చెరువు పరిధిలో ఎటువంటి నిబంధనలు పాటించకుండానే యథేచ్ఛగా డ్రైనేజీ పైప్‌లైన్లు తవ్వేస్తున్నారు. అసలు ఈ పనులకు నీటిపారుదల శాఖ చెరువుల పరిరక్షణ కమిటీల నుంచి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? లేక అధికారుల సొంత నిర్ణయాలతోనే ఈ విధ్వంసం సాగుతోందా? అనే ప్రశ్నలకు జీహెచ్‌ఎంసీ సమాధానం చెప్పలేకపోతోంది.*ప్రైవేట్ వెంచర్ల కోసమే ఈ తాపత్రయం*?కొత్త చెరువు సరిహద్దుల్లో వెలిసిన ప్రైవేట్ వెంచర్లు, కమర్షియల్ లేఅవుట్లకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. చెరువు పవిత్రతను, పర్యావరణాన్ని పణంగా పెట్టి ప్రైవేట్ వ్యక్తుల డ్రైనేజీ నీటిని కలిపేందుకు ఈ రూట్ ఎంచుకున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో ప్రైవేట్ వ్యాపారులకు రూటు క్లియర్ చేయడం వెనుక ఏ స్థాయి అధికారుల హస్తం ఉందో తేలాల్సి ఉంది.*ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందే* సర్వే నంబర్ 66లో చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ పనులపై విజిలెన్స్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి, చెరువు ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న బాధ్యులైన అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.









