
- కోహెడ, జూన్ 10: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కోహెడ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బందెల సుజాత–బాలకిషన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాలు నిండిన చిన్నారుల నమోదును పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అర్హులైన పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న విద్య, పోషకాహారం, ఆరోగ్య సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. అలాగే అంగన్వాడీ విద్యార్థులకు త్వరలో యూనిఫారాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు దర్శనాల నారాయణ, అంగన్వాడీ టీచర్లు గోరిట్యాల విజయలక్ష్మి, బందెల రాజేశ్వరి, హెల్పర్ డ్యాగటి స్వర్ణలత, విద్యార్థులు అక్షర, శ్రీమాన్, సంధ్య, ఆదిత్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.








