
విజేత ,హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పెరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ , భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఢిల్లీ వేదికగా నిర్వహించిన సమావేశంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రతి స్థానానికి ముగ్గురు బలమైన అభ్యర్థులతో కూడిన ప్యానెల్ జాబితాను తయారు చేసి సమర్పించాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులను ఆదేశించింది. వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న , మహబూబ్‌నగర్ – రంగారెడ్డి –హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి బిఆర్‌ఎస్ ప్రతినిధిగా ఎన్నికైన సురభి వాణీదేవిల పదవీకాలం 29 మార్చి 2027* నాటితో ముగియనుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి 2024 జూన్ ఉపఎన్నికలో నెగ్గిన తీన్మార్ మల్లన్న గడువుతో పాటు, 2021లో హైదరాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి గెలిచిన వాణీదేవిల ఆరేళ్ల గడువు ఒకే తేదీతో ముగుస్తుండటంతో.. నిబంధనల ప్రకారం మార్చి 2027 లోగా ఎన్నికలు జరగనున్నాయి.గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా, చాలా సంక్లిష్టంగా, దీర్ఘకాలికంగా సాగుతుంది. సాధారణ అసెంబ్లీ లేదా లోక్‌సభ ఓటర్ల జాబితా లాగా ఇది పాత జాబితా కొనసాగింపు కాకుండా, ప్రతి ఎన్నికకూ కొత్తగా నిబంధనల ప్రకారం సున్నా నుంచి ఓటర్లను నమోదు చేయాల్సి ఉంటుంది . నోటిఫికేషన్ లేదా పోలింగ్‌కు దాదాపు 4 నుంచి 5 నెలల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరలో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రారంభించనున్నారు. అప్పటికే అభ్యర్థుల్ని ప్రకటిస్తే వారే ఓటర్ల నమోదు బాధ్యత తీసుకుంటారు.సాధారణ శాసనసభ లేదా లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమాజంలోని విద్యావంతులు, ఉద్యోగులు,ఉపాధ్యాయులు , నిరుద్యోగుల రాజకీయ ఓటింగ్ ధోరణికి అద్దం పడతాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన విద్యా, ఉద్యోగ, యువజన విధానాలపై పట్టభద్రుల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక కొలమానంగా మారనుంది. ఈ స్థానం పరిధిలో అనేక మంది యువత, గ్రూప్స్ అభ్యర్థులు ఓటర్లుగా ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ రాబోయే ఎన్నికల్లో వీరి ప్రభావం ఎంతవరకూ ఉంటుందో అంచనా వేస్తున్నాయి. సమర్థవంతమైన, ప్రజల్లో పట్టున్న విద్యావంతులనే అభ్యర్థులుగా బరిలోకి దించాలన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతో సమర్థమైన యువ నేతల్ని అభ్యర్థులు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చూపించాలనుకునే బీఆర్ఎస్, బీజేపీ కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నించనున్నాయి.




