దానం నాగేందర్ పై వేటు! కాంగ్రెస్ లోకి ఫిరాయింపును తప్పుపడుతూ హైకోర్టు కీలక తీర్పు 

* తదుపరి కడియం శ్రీహరి పై?

* మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో సైతం ఆందోళన

* తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

విజేత,ఎడిటర్ డా.బి,అనిల్ కుమార్ : ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలలో గుబులు రేగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే పై హైకోర్టు వేటు వేసింది. భారత రాష్ట్ర సమితి నుంచి ఓ పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత.. సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు అదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఆయన పై వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన మిగతా తొమ్మిది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టుకుంది.

ఎమ్మెల్యేగా ఫిరాయించి ఎంపీగా పోటీ..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దానం నాగేందర్. ఆయనతోపాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. అయితే దానం నాగేందర్ ఒక అడుగు ముందుకు వేసి.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. భారత రాష్ట్ర సమితి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరింది. అయితే వీరు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని.. వారంతా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కావడంతో చర్యలు తీసుకోలేమంటూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన ఆధారాలను చూపించారు. దీంతో కోర్టు ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది.

కడియం శ్రీహరి పై కూడా పక్కా ఆధారాలు… 

అయితే ఇప్పుడు తరువాత సస్పెన్షన్ వేటు జాబితాలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా పోటీ చేశారు దానం నాగేందర్. కానీ అవే సార్వత్రిక ఎన్నికల్లో కడియం శ్రీహరి కుమార్తె కావ్య కూడా పోటీ చేశారు. ఆమె తరుపున కాంగ్రెస్ కండువా కప్పుకొని పలు సభల్లో పాల్గొన్నారు కడియం శ్రీహరి. వాటికి సంబంధించిన సాక్షాలతో న్యాయ పోరాటానికి భారత రాష్ట్ర సమితి సిద్ధపడుతోంది. దానం నాగేందర్ పై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడడంతో.. తరువాత కడియం శ్రీహరి పై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే న్యాయపరంగా మిగతా ఎమ్మెల్యేలను సైతం దోషులుగా నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

2004లో అలా..

పార్టీ ఫిరాయింపుల ద్వారా మూల్యం చెల్లించుకోవడం దానం నాగేందర్ కు కొత్త కాదు. 2004లో సైతం ఇదే మాదిరిగా పార్టీలు మారారు దానం నాగేందర్. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావించారు దానం నాగేందర్. కానీ హై కమాండ్ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన టిడిపిలోకి వెళ్లారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. గెలిచిన రోజుల వ్యవధిలోనే తెలుగుదేశం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా ప్రజలు తిరస్కరించారు. అయితే ఆ గుణపాఠాలు కూడా నేర్చుకోలేదు దానం నాగేందర్. ఇప్పుడు మరోసారి భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఆ తదుపరి వేటు ఇక స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిదే అని ప్రచారం నడుస్తోంది. ఇంకోవైపు మిగతా ఎమ్మెల్యేలు కూడా గుబులు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :