రూ.12 లక్షల నోట్లను కొరికేసిన ఎలుకలు

*రూ.12 లక్షల నోట్లను కొరికేసిన ఎలుకలు!* 

– భర్తకు తెలియకుండా 8 ఏళ్లుగా పొదుపు..

– బంగారం కొందామని పెట్టి తెరిచిన మహిళ

– ముక్కలైన కరెన్సీ చూసి గుండె పగిలినంత పని

– యూపీలోని గోండా జిల్లాలో ఘటన.. మాజిక మాధ్యమాల్లో వీడియో వైర

విజేత,లఖ్‌నవూ : భర్తకు తెలియకుండా ఎనిమిదేళ్లుగా పైసాపైసా కూడబెట్టిన ఓ మహిళకు తీరని వేదన మిగిలింది. ఇంటి ఖర్చులు తగ్గించుకుని రహస్యంగా దాచుకున్న రూ.12 లక్షల నగదు కాస్తా ఎలుకల పాలై చిత్తు కాగితాలుగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఈ విచిత్ర విషాద ఘటన వెలుగుచూసింది.

 *బంగారం కొందామని చూస్తే..* 

బాధిత మహిళ కుటుంబ అవసరాల నిమిత్తం ఇచ్చిన డబ్బుల నుంచి కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ వచ్చింది. అలా ఎనిమిదేళ్ల వ్యవధిలో ఏకంగా రూ.12 లక్షలను సమకూర్చింది. ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పకుండా ఇంట్లోని ఓ ఇనుప ట్రంకు పెట్టెలో భద్రపరిచింది. ఇటీవల ఆ మొత్తంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించిన ఆమె.. ఉత్సాహంగా పెట్టెను తెరిచి చూసింది. అయితే, అందులోని దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

*ముక్కలైన నోట్ల కట్టలు* 

పెట్టెలోని కరెన్సీ నోట్ల కట్టలను ఎలుకలు కొరికి ముక్కలు ముక్కలుగా మార్చేశాయి. చాలా వరకు నోట్లు పూర్తిగా నాశనమై పనికిరాకుండా పోయాయి. కుటుంబ సభ్యులు అందులోంచి కొన్నైనా పనికొచ్చే నోట్లను వేరుచేసేందుకు విఫలయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంట్లో భారీ మొత్తంలో నగదు భద్రపరచడం వల్ల దొంగతనాలు, అగ్నిప్రమాదాలే కాకుండా ఇలాంటి జీవుల వల్ల కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని, పొదుపు చేసుకునే మొత్తాన్ని బ్యాంకుల్లో దాచుకోవడమే సురక్షితమని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :