సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

విజేత,పటాన్‌చెరు : ఔటర్ రింగ్ రోడ్ లో సుల్తాన్‌పూర్ ఎగ్జిట్ సమీపంలో శనివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హెచ్‌ఆర్70హెచ్4568 నంబర్ గల టయోటా ఫార్చ్యూనర్‌లో నలుగురు ప్రయాణికులు పటాన్‌చెరు వైపు వెళ్తుండగా, వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ ఎదురుగా ఉన్న రహదారిపైకి దూసుకెళ్లింది.అదే సమయంలో బొల్లారం వైపు వెళ్తున్న టీజీ08జీ9450 నంబర్ గల ఎంజీ ఆస్టర్ ఈవీ కారును పల్టీ కొట్టిన ఫార్చ్యూనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆస్టర్ ఈవీలో ప్రయాణిస్తున్న నలుగురికి ఎలాంటి గాయాలు కాకపోయినా, వాహనం దెబ్బతింది.కొద్ది క్షణాలకే అదే దిశలో వస్తున్న టీజీ08జేఆర్5762 నంబర్ గల టాటా నెక్సాన్ కారు కూడా పల్టీ కొట్టిన ఫార్చ్యూనర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్‌లో ప్రయాణిస్తున్న ఒకరు, టాటా నెక్సాన్‌లో డ్రైవర్ పక్కన కూర్చున్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.