
*డీఎంహెచ్‌ఓ ఆఫీస్ పక్కన తాత్కాలిక క్లీనింగ్*..
*మళ్లీ మొదలైన చెత్త. నరకం అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం*..
*సీసీ కెమెరాలు, నోటీసు బోర్డులు పెట్టాలని డిమాండ్*
విజేత,రాజేంద్రనగర్ :
పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం జీహెచ్‌ఎంసీ శానిటేషన్ సిబ్బంది వచ్చి అరకొరగా చెత్తను తొలగించి చేతులు దులుపుకుంటున్నారు తప్ప, అక్కడ శాశ్వత చర్యలు చేపట్టడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) అధికారులు, మున్సిపల్ యంత్రాంగం ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క రోజు క్లీనింగ్ హడావుడి చేసి వదిలేస్తుండటంతో, మరుసటి రోజు నుంచే మళ్లీ యధావిధిగా కొండల్లా చెత్త పేరుకుపోతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రధాన కార్యాలయం ముందే ఈ దారుణమైన కంపు కొడుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముక్కు మూసుకుని స్కూలుకు.. నరకప్రాయంగా ప్రయాణం ఈ దారి గుండా వెళ్లే సామాన్య ప్రజలు, ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే ఉన్న హాస్పిటల్‌కు వచ్చే రోగులు ఈ దుర్వాసన భరించలేక మరింత అస్వస్థతకు గురవుతున్నారు. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి కొత్త రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఘాటు డిమాండ్లు ఇవే..
ఇకనైనా మొక్కుబడి చర్యలు పక్కనబెట్టి, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కింద పేర్కొన్న శాశ్వత చర్యలు చేపట్టాలని స్థానికులు ఖరాకండిగా డిమాండ్ చేస్తున్నారు:సీసీ కెమెరాల ఏర్పాటు: ఇక్కడ రహస్యంగా చెత్త వేసి వెళ్లే కిలాడీలను పట్టుకోవడానికి తక్షణమే చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.హెచ్చరిక బోర్డులు: “ఇక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవు.. భారీ జరిమానా విధించబడును” అని స్పష్టం చేసేలా నోటీసు బోర్డులను వెంటనే పాతాలి.కాలనీ చెత్త ఆటోల నిరంతర నిర్వహణ: కాలనీల్లోకి వచ్చే జీహెచ్‌ఎంసీ చెత్త ఆటోలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రతిరోజూ యధావిధిగా తిరిగేలా చూడాలి. అప్పుడే ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ఉంటారు.సొంత ఆఫీసు పక్కనే ఇంత పెద్ద చెత్త కుప్ప పెట్టుకుని, జిల్లా ప్రజలకు ఆరోగ్యం గురించి అధికారులు ఏం చెబుతారని స్థానికులు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి స్పందించకుంటే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.





