
*శంషాబాద్‌లో ‘బొలెరో’ బీభత్సం*
*బస్టాప్‌లోకి దూసుకెళ్లిన మృత్యుశకటం.. ఇద్దరు మహిళలు దుర్మరణం*
*అతివేగం.. అజాగ్రత్త.. మరో రెండు ప్రాణాలను బలిగొన్నాయి*
విజేత,రాజేంద్రనగర్ : గురువారం ఉదయం శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు కోసం నిరీక్షిస్తున్న అమాయక మహిళలపైకి మృత్యురూపంలో దూసుకొచ్చిన బొలెరో వాహనం ఇద్దరిని అక్కడికక్కడే బలితీసుకుంది.కర్ణాటక నుంచి పచ్చిమిర్చి లోడుతో హైదరాబాద్ వైపు వస్తున్న ఓ బొలెరో వాహనం శాతంరాయి వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో, దాన్ని తప్పించబోయి డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. అంతే.. క్షణాల వ్యవధిలో ఆ వేగవంతమైన వాహనం రోడ్డు పక్కనే ఉన్న బస్టాప్‌లోకి దూసుకెళ్లింది.అక్కడికక్కడే ప్రాణాలు గాల్లోకి..ఆ సమయంలో బస్సు కోసం అక్కడ వేచి చూస్తున్న ఇద్దరు మహిళలను బొలెరో బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత ఘోరంగా ఉందంటే.. వాహనం కింద పడి నలిగిపోయిన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రోడ్డుపై రక్తం ఏరులై పారగా, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని,మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా,పచ్చిమిర్చి లోడుతో వచ్చిన వాహనం.. ఆ కుటుంబాల్లో మాత్రం కోలుకోలేని చేదు విషాదాన్ని మిగిల్చింది.









