
విజేత ఎల్లారెడ్డిపేట:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పిండ ప్రధానం చేసిన పలువురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ ఎన్. రమేష్ తెలిపారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ ఎన్. రమేష్ మాట్లాడుతూ.. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలరోజుల పాటు పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.అదే విధంగా పోలీసుల అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ హెచ్చరించారు.ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల సూచనలు, నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్ ఐ ఎన్. రమేష్ కోరారు. ఎల్లారెడ్డిపేటలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








