వైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం 

విజేత. నల్లజర్ల ;  లక్ష్యాలను నిర్ధేశించుకుని, కఠోర శ్రమతో కలలను సాకారం చేసుకోవాలని, సమయ పాలన పాటిస్తూ సానుకూల దృక్పథంతో ఎదుగుతూ పోవాలనీ, వజ్రానికి సాన పెడితేనే ప్రకాశిస్తుందని, వాడకపోతే ఇనుము సైతం తుప్పు పడుతుందని ఫిలానిలోని సీరిసీనియర్ సైంటిస్ట్ (రిటైర్డ్) కె.ఎస్.ఎన్.రావు అన్నారు. ప్రకాశరావుపాలెం వైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం బి.టెక్ ప్రధమ సంవత్సరం విద్యార్ధులకు తరగతులను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ అయిపోయాక కూడా అప్ డేట్ కాకపోతే వెనుకబడిపపోతారని పేర్కొన్నారు. సెల్ ఫోన్ భవిష్యత్తును శాసిస్తుందని దాన్ని విజ్ఞానానికే వినియోగించాలని, వైఫల్యాలకు కారణాలు వెతకవద్దని, జవాబుదారీతనం ఉండాలని, తరగతి గదిలో విన్న అంశాలను స్వీయా అధ్యయనం చేసుకోవాలన్నారు. పిల్లల తీరుతెన్నులను తల్లితండ్రులు మదింపు చేసుకోవాలని, పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ ఎంతో కీలకమైందని ఆయన తెలిపారు. మార్కులే ప్రాతిపదిక కాదని ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఉంటేనే రాణిస్తారని, ప్రతి విద్యార్ధికి ఒక మెంటార్ ఉండాలని వారి మార్గదర్శకాలు కెరీర్ కు దోహదం చేస్తాయని ఆయన వివరించారు. అన్ని దేశాల జిడిపిలో టెక్నాలజీ పాత్ర ఉందని, ఇంజనీరింగ్ లేని రంగాన్ని ఊహించలేమని ఇంజనీరింగ్ చదవడం అంటే దేశ నిర్మాణంలో భాగం పంచుకోవడమేనన్నారు.కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆకుల త్రిమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నామని కళాశాలలోని మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. ఒక చేత్తో బిటెక్ పట్టా, మరో చేత్తో ఉద్యోగం పట్టుకుని వెళ్లేలా ఆల్ రౌండ్ ప్రతిభతోనూ విద్యార్ధులను తీర్చిదిద్దుతున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.ఎస్.సాంబశిరావు మాట్లాడుతూ వైజ్ కళాశాల వసుదయిక కుటుంబమని, కళాశాల ప్రస్ధానంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించామని, వేలాది మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో స్ధిరపడ్డారని గుర్తు చేశారు. అధ్యాపకుల సమిష్టి కృషితో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నామని, తల్లి తండ్రుల తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తామని, తమ కళాశాలను ఎంచుకున్న తల్లితండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో భాగంగా సీనియర్ విద్యార్థులు, అధ్యాపకులు నూతన విద్యార్ధులతో మమేకం అయ్యారు. విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలుత ముఖ్య అతిథిని కళాశాల యాజమాన్యం సత్కరించింది. కళాశాల ట్రజరర్ మెహర్ మోహన్, అధ్యాపకులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :