
విజేత,చిలకలూరిపేట: పట్టణంలోని ఔటర్ బైపాస్ సెంటర్లో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… కోటప్పకొండ నుంచి వేలూరు గ్రామానికి వెళ్లేందుకు పలువురు ప్రయాణికులు అవుట్రోడ్డు సెంటర్ వద్ద వేచి చూస్తున్నారు. అదే సమయంలో బెంగళూరు వైపు అతివేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు ప్రయాణికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలతో నలుగురు నుంచి ఆరుగురు ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 108 వాహనాల్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామునే జరిగిన ఈ ఘోర విషాదంతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.








