
మరోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సైతం సంకేతాలు
బొత్స పై సైతం అనుమానాలు
దిద్దుబాటు చర్యల్లో జగన్
పిలిచి మాట్లాడిన వైనం
విజేత, అమరావతి బ్యూరో : ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతుండడంతో ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళనకర పరిస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు భీమిలి నియోజకవర్గం ఇన్చార్జ్ బాధ్యతలను సైతం చిన్న శ్రీను వదులుకున్నారు. ఇప్పుడు ఆయన బాటలోనే మరి కొంతమంది ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ప్రముఖంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు వినిపిస్తోంది.
తీవ్ర నిర్ణయం దిశగా తమ్మినేని..
గత కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లా నాయకత్వంతో తమ్మినేని కి విభేదాలు ఉన్నాయి. పైగా ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తమ్మినేని తప్పించి ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు అప్పగించారు. అప్పటినుంచి తమ్మినేని సీతారాం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు మీడియా ముందుకు వచ్చి జిల్లా నాయకత్వం, ముఖ్యంగా ధర్మాన సోదరుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తద్వారా వైసిపికి గుడ్ బై చెబుతామన్న సంకేతాలు పంపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీకి వచ్చే అవకాశం లేదు అని తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్ తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమ్మినేని ఫ్యామిలీ వైసిపి నుంచి బయటకు వెళ్తున్న ప్రచారం జోరుగా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి తమ్మినేని తాడేపల్లికి పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయినా సరే పార్టీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు అని తమ్మినేని భావిస్తున్నట్లు సమాచారం.
అంతర్మధనంలో బొత్స..
మరోవైపు శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీమంత్రి బొత్స చుట్టు కూడా అనేక రకాల అనుమానపు చూపులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన స్వయానా మేనల్లుడు చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరిపోయారు. అప్పటినుంచి బొచ్చలు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఎప్పుడు పవర్ పాలిటిక్స్ కు దగ్గరగా ఉండే బొత్స కు.. ఆ కారణంతోనే జగన్మోహన్ రెడ్డి పిలిచి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఆపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. అయితే వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలు ఇప్పుడు బొత్సని వెంటాడుతున్నాయి. పిల్లల రాజకీయ వారసత్వం కోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నమ్మిన బంటుగా ఉన్న మేనల్లుడు చిన్న శ్రీను పార్టీకి గుడ్ బై చెప్పడంతో బొత్సపై ఒక రకమైన సానుభూతితో పాటు వైసీపీ శ్రేణులు అనుమానంతో ఉన్నాయి. ఆయన సైతం పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఫ్యామిలీ స్కెచ్ లో భాగంగానే ముందుగా చిన్న శ్రీను బయటకు వెళ్లిపోయినట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. ఈ పరిణామాల క్రమంలో జగన్మోహన్ రెడ్డి బొత్సను పిలిపించి మాట్లాడారు. చీపురుపల్లి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విజయనగరం జిల్లాలో చేజారి పోయే నేతల విషయంపై చర్చించారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
పట్టు చిక్కని ఉత్తరాంధ్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర పై పూర్తిస్థాయి పట్టు దొరకలేదు జగన్మోహన్ రెడ్డికి. 2014 ఎన్నికల్లో సైతం కేవలం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచారు. 2019లో వైసీపీ ప్రభంజనంలో సైతం ఓ ఆరు సీట్లను గెలుచుకుంది టిడిపి. అయితే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీకి ముఖం చాటేస్తున్నారు. పార్టీ నాయకత్వం తీరును నిరసిస్తూ గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే చిన్న శ్రీను రూపంలో వైసీపీకి దెబ్బ తగిలింది. ఇప్పుడు తమ్మినేని రూపంలో మరో దెబ్బ ఎదురు కానుంది.మొత్తానికి అయితే ఉత్తరాంధ్రలో వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.








