నేపాల్‌లో జల ప్రళయం.. 900 దాటిన మృతులు

4,200 మందికిపైగా గల్లంతు..

వారిలో 592 మంది విదేశీయులు

అంటువ్యాధుల భయంతో సామూహిక ఖననం

ముమ్మరంగా భారత్, చైనా బృందాల సహాయక చర్యలు

విజేత,ఖాట్మాండు: పొరుగు దేశం నేపాల్‌ను కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. హిమాలయ దేశంలో సంభవించిన ఈ జల విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 903కు చేరింది. నదీ తీరాలకు కొట్టుకొస్తున్న మృతదేహాలు విపత్తు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నా.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) వెల్లడించింది.

దేవఘాట్‌లో సామూహిక ఖననం…

వరదల ధాటికి దక్షిణ చిత్వాన్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఒక్క ఈ జిల్లాలోనే ఇప్పటివరకు 272 మృతదేహాలను వెలికితీశారు. భారీ సంఖ్యలో శవాలు లభ్యమవుతుండటంతో అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కాళీ గండకి, త్రిశూలి నదుల సంగమ ప్రాంతమైన దేవఘాట్‌లో పెద్ద ఎత్తున సామూహిక ఖననాలు నిర్వహించారు. భవిష్యత్తులో మృతులను గుర్తించేందుకు వీలుగా ముందే డీఎన్‌ఏ నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. మరో 21 గుర్తుతెలియని మృతదేహాలను స్థానిక ఆసుపత్రుల్లో భద్రపరిచారు.

టన్నెళ్లలో చిక్కుకున్న కార్మికులు..

ఈ ప్రళయంలో సుమారు 4,247 మంది గల్లంతయ్యారు. వీరిలో 592 మంది విదేశీ పర్యాటకులు ఉండటం కలవరపెడుతోంది. భోటేకోశి, త్రిశూలి నదీ పరీవాహక ప్రాంతాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న 933 మంది కార్మికులు గల్లంతయ్యారు. వీరిలో పలువురు సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. సరిహద్దుల్లో విధుల్లో ఉన్న సైనికులు, పోలీసుల ఆచూకీ కూడా గల్లంతైన జాబితాలో ఉంది.

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు..

విపత్తు తీవ్రత దృష్ట్యా దాదాపు 21 వేల మందికి పైగా సైన్యం, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. భారత్, చైనాకు చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు ప్రాజెక్టు టన్నెళ్ల వద్ద సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.

– ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా 3,344 మంది సహా మొత్తం 10,451 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో 252 మంది విదేశీయులు ఉన్నారు.

– క్షతగాత్రులైన 267 మందిలో 156 మంది కోలుకొని ఇళ్లకు చేరగా, మిగిలిన వారికి చికిత్స అందుతోంది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :