మనిషి ఆరోగ్యానికి సేంద్రియ వ్యవసాయం మేలు

– సేంద్రియ వ్యవసాయంపై రైతన్నలకు ఆసక్తి చూపాలి

-పంటలు పండిస్తూ మార్పు తేవాలి

రైతులు తమ 10 ఎకరాల్లో ఒక ఎకరా ప్రకృతి వ్యవసాయానికి కేటాయించాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రసాయన ఎరువులతో భూసారం దెబ్బతినడంతో పాటు అనారోగ్య సమస్యలు

ఏకలవ్య ఫౌండేషన్ సేవలు వెలకట్టలేనివి

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

విజేత,తాండూరు : రసాయన ఎరువుల వినియోగంతో భూసారం క్రమంగా క్షీణించడమే కాకుండా, వాటితో పండించిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. రైతులు ఇకనైనా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జింగుర్తి సమీపంలోని ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సందీపని గురుకులంలో నిర్మించిన పలు భవనాలను ఆదివారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..రైతులు తమకున్న పది ఎకరాల భూమిలో కనీసం ఒక ఎకరాన్ని ప్రకృతి వ్యవసాయానికి కేటాయించాలని కిషన్‌రెడ్డి సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించవచ్చని పేర్కొన్నారు.

ఏకలవ్య ఫౌండేషన్ సేవలు అభినందనీయం

ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలతో కూడిన విద్యను అందించేందుకు సందీపని గురుకులాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రకృతి వ్యవసాయ కళాశాలతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేలా గురుకులాన్ని నిర్వహిస్తున్న ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాగయ్యను ఆయన అభినందించారు. ఫౌండేషన్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ప్రజాదరణ పొందిన మన్ కీ బాత్ కార్యక్రమం 374వ ఎపిసోడ్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి వీక్షించారు. దేశ అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రధాని సందేశాన్ని వారు ఆసక్తిగా విన్నారు.సందీపని గురుకుల విద్యార్థులు ప్రదర్శించిన ‘బల భీమ’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వీరత్వాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రదర్శన కార్యక్రమానికి హాజరైన అతిథులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :