ఓటు హక్కులో నిర్లక్ష్యం తగదు

ఓటు హక్కులో నిర్లక్ష్యం తగదు.​పార్టీ నాయకులూ ఓటర్లను నిద్రలేపండి​

ఓటర్ల నమోదును 100%పూర్తి చేయడానికి నాయకులు రంగంలోకి దిగాలి

నమోదుకు మిగిలింది ఐదే ఐదు రోజులు: ఈఆర్ఓ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి తీవ్ర హెచ్చరిక

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇంకా గ్రామాలు-పట్టణాల సందిగ్ధంలోనే వేలాదిమంది ఓటర్లు

547 పోలింగ్ బూత్‌లు 511కి కుదింపు.. 9 స్థానాల్లో బూత్‌ల మార్పు

విజేత ​,రాజేంద్రనగర్ : ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువైన ‘ఓటు’ నమోదు విషయంలో ఓటర్లలో నెలకొన్న నిర్లక్ష్యానికి తెరదించాలని, ప్రజలను చైతన్యపరచడంలో రాజకీయ పార్టీల నాయకులు తక్షణమే చొరవ చూపాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈ ఆర్ ఓ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సూటిగా స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, నమోదు ప్రక్రియ ముగియడానికి ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, 100 శాతం లక్ష్యాన్ని సాధించడంలో నాయకులు నిర్లక్ష్యం వీడి అధికారులతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
​బుధవారం కిస్మత్‌పూర్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన అత్యవసర అవగాహన సమావేశంలో ఈఆర్ఓ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.​రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బుధవారం నాటికి 57.2 శాతం ఓటర్ల పేర్ల డిజిటలైజేషన్ మాత్రమే పూర్తయిందని, ఇప్పటివరకు 3.62 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను తిరిగి అందజేశారని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అయితే, నియోజకవర్గంలో వేలాదిమంది ఓటర్లు ఇప్పటికీ తీవ్ర సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఓటు సొంత గ్రామంలో ఉండాలా? లేక ఇక్కడే నమోదు చేసుకోవాలా?” అనే అయోమయంలో ప్రజలు ఉన్నారని, వారిలో అవగాహన కల్పించి నిబంధనల ప్రకారం ఏదో ఒక చోట తప్పనిసరిగా ఓటరుగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి రాజకీయ నాయకులదేనని ఆయన తేల్చిచెప్పారు.​ఓటర్ల సౌకర్యార్థం మరియు నిర్వహణ సులభతరం చేసేందుకు నియోజకవర్గం లోని పోలింగ్ కేంద్రాల స్వరూపాన్ని భారీగా మార్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఉన్న 547 పోలింగ్ బూత్‌లలో 36 బూత్‌లను పక్కనే ఉన్న ఇతర కేంద్రాల్లోకి విలీనం (Merge) చేశారు. దీనితో ఇకపై నియోజకవర్గంలో మొత్తం 511 పోలింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
*​గందరగోళానికి చెక్.. ప్రాధాన్యత ఇక్కడే*
​హైదర్‌షాకోట్, బుద్వేల్, గంధంగూడ ప్రాంతాల్లోని ఎంపీపీ స్కూళ్లలో ఉన్న 9 పోలింగ్ బూత్‌లను పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు మార్చడం జరిగింది.​శంషాబాద్ ప్రాంతంలో ఓటర్లు ఓటు వేయడానికి రోడ్డు దాటి వెళ్లాల్సి వస్తున్న ఇబ్బందులను గమనించి, ఇకపై శంషాబాద్ రోడ్డుకు ఎడమవైపు ఉన్న ప్రజలు తమ వైపే ఓటు వేసేలా నూతన పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఈఆర్ఓ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.​సమయం తక్కువగా ఉన్నందున నాయకులు ఈ ఐదు రోజులు ప్రతి గడపకూ వెళ్లి ఓటరు నమోదును పండుగలా నిర్వహించాలని,ఒక్క అర్హత ఉన్న పౌరుడు కూడా ఓటు హక్కుకు దూరం కాకూడదని హెచ్చరిస్తూ సమావేశాన్ని ముగించారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :