
*కారంపూడి లో అనుమతులు లేని.. వెంచర్లు…*
*చోద్యం చూస్తున్న అధికారులు*
*ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరికి వారే వెంచర్లు వేస్తున్న వైనం*
విజేత,కారంపూడి :
కారంపూడి మండలంలో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి అమాయ కులకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు అనుమతలు లేకుండా రిజిస్ర్టేషన్ చేస్తున్నారు.వాటిని కొనుగోలు చేసిన ప్రజలు రిజిస్ర్టేషన్, ఇంటి నిర్మాణ అనుమతులు, బ్యాంకు లోన్ పొందే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ భూములను ప్లాట్లుగా విక్రయించాలంటే నాలా కన్వర్షన్ ద్వారా ఆర్డీవో నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది. వెంచర్‌లో పది శాతం స్ధానిక సంస్థలకు రిజిస్ర్టేషన్ చేయాలి. వెంచర్‌కు అప్రోచ్ రోడ్లు 60 ఫీట్లు, లోపల 40 ఫీట్ల రోడ్లు, 33 ఫీట్ల వెడల్పు రోడ్లు ఏర్పాటు చేయాలి. పాఠశాల, పార్కు, గుడి, కమ్యూనిటీ హాలు, హెల్త్ సెంటర్, ఓవర్ హెడ్ ట్యాంకు అవసరాలకు స్థలం కేటాయించాలి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌లైన్‌లు వంటి అభివృద్ధి పనులు, రియల్‌ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే ఇరుకు రోడ్లతో వెంచర్లు వెలుస్తున్నాయి. ఏజెంట్లు ప్రభుత్వానికి ఫీజులు, అనుమతుల రూపంలో వచ్చే ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలు పాటించకుండా ప్లాట్లను విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. వాటిని కొనుగోలు చేసిన ప్రజలు క్రమబద్దీకరణ, ఇంటి నిర్మాణానికి అనుమతులకు ఫీజులు, పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. అనంతరం నష్టపోయిన తర్వాత ప్రజలు ఆలోచిస్తే లాభం లేదు..






