
– ఏటా 16–20 శాతం ఫీజుల పెంపు
– పాఠశాలల్లో కనీస సౌకర్యాలపై ప్రశ్నలు
– పేరెంట్–టీచర్ సమావేశాలకూ దూరం
– జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఏదీ?
– చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్
విజేత, వరంగల్ బ్యూరో: హన్మకొండ జిల్లాలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, ఇతర విద్యా సామగ్రి విక్రయిస్తూ అదనపు భారం మోపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ప్రతి సంవత్సరం ఫీజులను భారీగా పెంచుతున్నా.. అందుకు తగ్గట్టుగా విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, తల్లిదండ్రులతో సమన్వయం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటా ఫీజుల పెంపు
కొన్ని పాఠశాలల్లో ప్రతి విద్యా సంవత్సరంలో ఫీజులను సుమారు 16 నుంచి 20 శాతం వరకు పెంచుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫీజుల పెంపునకు సంబంధించిన కారణాలు, అందుకు అనుగుణంగా అందిస్తున్న అదనపు సౌకర్యాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నా.. సరైన సమాధానం లభించడం లేదని అంటున్నారు.
పుస్తకాలు..డ్రెస్‌లు పాఠశాలలోనే!
పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాం, ఇతర విద్యా సామగ్రిని బయట కొనుగోలు చేసే అవకాశం లేకుండా పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరలతో పోలిస్తే పాఠశాలలో విక్రయించే సామగ్రికి అధిక ధరలు ఉంటున్నాయని వారు చెబుతున్నారు. దీంతో విద్యార్థుల చదువుకు అయ్యే మొత్తం ఖర్చు ఏటేటా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరెంట్–టీచర్ సమావేశాలు ఏవీ?
విద్యార్థుల చదువు, ప్రవర్తన, విద్యా ప్రగతిపై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు పేరెంట్–టీచర్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని పాఠశాలల్లో కనీసం అలాంటి సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లల విద్యా ప్రగతిపై ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం కూడా తమకు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ మాటేంటి?
జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలనే నిబంధనలు, ఆదేశాలు లేదా పాఠశాలల స్వంత విధానాల పరిధిలో తమకు వర్తించే ప్రయోజనాలు అమలు కావడం లేదని కొందరు జర్నలిస్టు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. రాయితీ గురించి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. “ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అనే ధోరణిలో సమాధానాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు.
అధికారులు స్పందించాలి
విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడకుండా పాఠశాలల ఫీజుల వసూళ్లు, పుస్తకాలు– యూనిఫాం విక్రయాలు, రాయితీల అమలు, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.తల్లిదండ్రుల ఫిర్యాదులపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.








