దేవరపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్లకు 24 లక్షల విలువైన బొలెరో వాహనాలు బహుకరణ

– దేవరపల్లి సర్కిల్ కార్యాలయం పి 4 విధానంలో పోలీస్ సేవలకు మరింత బలం

– దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రూ.24 లక్షల విలువైన రెండు బొలెరో నియో వాహనాలు అందజేత

విజేత,గోపాలపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పి.4 విధానంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రూ.24 లక్షల విలువైన రెండు మహీంద్రా బొలెరో నియో వాహనాలను అందజేశారు.

రాజమహేంద్రవరం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ సమక్షంలో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు ఈ వాహనాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు.గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు ఒక మహీంద్రా బొలెరో నియో వాహనాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గోపాలపురం మండల నాయకులు మరియు వారి సహచరుల సౌజన్యంతో అందజేశారు. అదేవిధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు మరో బొలెరో నియో వాహనాన్ని పరమేశు బయోటెక్ సంస్థ తమ సంస్థ సౌజన్యంతో అందజేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద స్వరూప్ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు తో కలిసి ఈ వాహనాన్ని పోలీస్ శాఖకు అందజేశారు.ఒక్కో వాహనం విలువ రూ.12 లక్షలు కాగా, రెండు వాహనాల మొత్తం విలువ రూ.24 లక్షలు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ఈ వాహనాలు పోలీసు అధికారులు, సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు, శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రజాప్రతినిధులు, సంస్థలు మరియు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, ఎస్‌బీ డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, దేవరపల్లి సర్కిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.