పాపకు పేరు పెట్టిన విరుష్క జంట




సెలెబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క ఇప్పుడు నూతనోత్సాహంతో ఉన్నారు. జనవరి 11న ఈ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాప ఫొటోలు, ఇతర వివరాలు ఏమీ బయటకు వెల్లడించలేదు. ఆ మధ్య విరుష్క జంట పాప ఈమే అంటూ కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. అయితే అవన్నీ ఫేక్ ఫొటోలనీ.. సమయం వచ్చినప్పుడు తానే వివరాలు వెల్లడిస్తానని కోహ్లీ చెప్పాడు.

అనుష్క శర్మ సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఒక ఫొటో పోస్టు చేసింది. విరాట్, అనుష్క తమ పాపను ఎత్తుకొని ఉన్న ఆ ఫోటో వైరల్‌గా మారింది. అందులోనే పాప పేరు 'వామిక' అని అనుష్క తెలిపింది. 'మేమిద్దరం ప్రేమ, వాత్సల్యంతో కలసి ఉంటూ మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కానీ ఈ చిన్నారి వామిక మాత్రం మా జీవితాలను మరో స్థాయికి తీసుకొని వెళ్లింది. కన్నీళ్లు, సంతోషం, బాధ వంటి భావోద్వేగాలను ఒక్కోసారి నిమిషాల వ్యవధిలో అనుభవిస్తున్నాము' అంటూ ఆ పోస్టులో పేర్కొన్నది.

విరుష్క జంట తమ పాపకు వామిక అని పేరు పెట్టడమే కాకుండా ప్రస్తుతం వారి జీవితం ఎలా సాగుతున్నదో ఆ పోస్టులోనే తెలియజేయడంతో అభిమానులు ఆనందానికి అంతు లేకుండా పోయింది. అయితే ఆ ఫొటోలో పాప తల మాత్రమే కనిపిస్తున్నది కానీ మొఖం కనిపించడం లేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ కోసం సిద్దపడుతున్నాడు.

 


Latest News
more

Trending
more