థియేటర్లు ఓపెన్ కాకపోవడానికి అంబానీనే కారణం.. సినీ స్టార్ సంచలన వ్యాఖ్యలు




సినిమా థియేటర్లు పూర్తిగా తెరవకపోవడం వల్ల సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. ఇందుకు అంబానీనే కారణమని కన్నడ సినీ స్టార్ దర్శన్ తూగుదీప సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చాలా నష్టపోతున్నారని.. సినిమాలకు పెట్టిన పెట్టుబడులు కూడా వెనక్కు రావడం లేదని దర్శన్ వాపోయారు.

ఒకవైపు కర్ణాటకలో స్కూల్స్, కాలేజీలు పూర్తిగా తెరుచుకున్నాయి. ఫంక్షన్ హాల్స్, మార్కెట్లలో ప్రజలు సాధారణంగానే తిరుగుతున్నారు. కానీ థియేటర్లకు మాత్రం పూర్తి స్థాయిలో అనుమతులు రావడం లేదు. ఇందులో అంబానీ హస్తం ఉంది అని ఆయన ఆరోపించారు. త్వరలో జియో నుంచి 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం వల్ల అంబానీకి చెందిన జియోకు చాలా లాభం చేకూరనున్నది. అందుకే థియేటర్లకు పూర్తి స్థాయి ప్రేక్షకులను అనుమతించకుండా కుట్ర పన్నాడని దర్శన్ ఆరోపించారు.

సగం నిండిన థియేటర్ల వల్ల నిర్మాతలకు లాభం రాదు. వాళ్లు ఓటీటీలను ఆశ్రయిస్తారు.. అప్పుడు అంబానీకే లాభం వస్తుందని దర్శన్ అంటున్నారు. కాగా, దర్శన్ నటించిన 'రాబర్ట్' అనే సినిమా మార్చి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. తన సినిమాకు 50 శాతం మంది ప్రేక్షకులు వచ్చినా థియేటర్లోనే విడుదల చేస్తాను. అసలు ఓటీటీల్లో విడుదల చేయను అని చెప్పారు. దర్శన్ వ్యాఖ్యలు కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాది పరిశ్రమల్లో సంచలనంగా మారింది.


Latest News
more

Trending
more