వాట్సప్‌ను వదిలేస్తున్న వినియోగదారులు.. భారీగా సిగ్నల్ యాప్ ఇన్‌స్టాలేషన్లు




ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన పర్సనల్ మెసేజింగ్ యాప్ 'వాట్పప్'కు పలువురు గుడ్‌బై చెబుతున్నారు. వాట్సప్ తమ ప్రైవసీ పాలసీని మార్చడంతో దానిపై నమ్మకం లేక సరికొత్త యాప్ 'సిగ్నల్'ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న 'వాట్సప్'ను సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ 'ఫేస్‌బుక్' ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాట్సప్ వినియోగదారుల డేటాను థర్డ్ పార్టీ సంస్థలతో పంచుకుంటున్నది. అందుకు అనుగుణంగా థర్డ్ పార్టీ సంస్థలకు యూజర్ల డేటాను వాడుకునేలా వాట్సప్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేసింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వాట్సప్‌పై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దీనికి పోటీగా 'సిగ్నల్' అనే యాప్ వచ్చింది.

సిగ్నల్ యాప్ యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తుందనీ.. ఇది థర్డ్ పార్టీ సంస్థలకు తమ యూజర్ల డేటాను ఇవ్వబోదని సిగ్నల్ స్పష్టం చేస్తున్నది. సిగ్నల్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ కంపెనీకి సొంతమైన సిగ్నల్ యాప్‌ను మాక్సీ రూపొందించారు. వాట్సప్ కోఫౌండర్ అయిన ఆక్టన్ ఈ సిగ్నల్ ఫౌండేషన్‌కు కోఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల వాట్సప్ తమ ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేశాక అనేక విమర్శలు చెలరేగాయి. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఏకంగా సిగ్నల్ మెసెంజర్‌ను వాడమని ట్విట్టర్ వేదికగా కోరడంతో అనేక మంది సిగ్నల్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. సిగ్నల్‌ ద్వారా చేసే కాల్స్ మామూలు మొబైల్ కాల్స్ లాగే చాలా క్లారిటీగా ఉండటం ప్రధాన ఆకర్షణ. మరోవైపు మన ఐపీ అడ్రస్ తెలియకుండా కూడా కాల్స్ చేసుకునే ఆప్షన్ సిగ్నల్‌లో ఉన్నది. వీడియో కాల్స్ సౌకర్యం కూడా ఈ యాప్‌లో ఉన్నది. ప్రస్తుతం సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండీస్, మాక్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పని చేస్తున్నది.

మరోవైపు వాట్సప్ కూడా నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. తమ ప్రైవసీ పాలసీ మారినా వినియోగదారుల మెసేజెస్‌కు పూర్తి ప్రైవసీ ఉంటుందని చెబుతున్నది. అయితే థర్డ్ పార్టీలకు యూజర్ల డేటాను షేర్ చేస్తున్నట్లు మాత్రం వెల్లడించింది.


Latest News
more

Trending
more