ఆఫ్రిది కూతురిని పెళ్లాడనున్న పేస్ బౌలర్!




పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది తన కూతురి పెళ్లిని నిశ్చయం చేశారు. తమ దేశానికే చెందిన పేసర్ షహీన్ ఆఫ్రిదితో తన కూతురి  నిఖా ఖాయం చేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రపోజల్ షహీన్ కుటుంబం నుంచి మొదట వచ్చిందని తెలిపిన ఆఫ్రిది ఆ ప్రతిపాదనకు తమ కుటుంబం సంతోషంగా ఒప్పుకుందని తెలిపారు. వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని తన కూతురి వివాహం కూడా ఆ దేవుడే నిర్ణయించాడని ఆఫ్రిది సంతోషంగా చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా షహీన్ కు అంతా మంచి జరగాలని కోరుకుంటానని ఆఫ్రిది పేర్కొన్నారు. 

ఈ విషయాన్ని పీటీఐ కూడా నిర్దారించింది. పాకిస్థాన్ మీడియా కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ 20 ఏళ్ల షహీన్ ఆఫ్రిది త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడని కథనాలు ప్రసారం చేసింది. ఈ విషయంపై స్పందించిన షహీన్ తండ్రి అయాజ్ ఖాన్ " మా రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. అతి త్వరలోనే నిఖా రోజును ప్రకటించనున్నామని" స్థానిక మీడియాకు తెలిపారు. కాబోయే మామ అల్లుళ్లు ఇద్దరూ పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో కలిసి ఆడారు. కరోనా కేసులు పెరగడంతో క్రికెట్ లీగ్ వాయిదా పడింది. కెరీర్ లో షహీన్ ఇప్పటివరకు 15 టెస్టులు, 22 వన్డే, 21 టీ20 మ్యాచులను ఆడాడు. పెళ్లి వార్తలతో అభిమానులు ఆఫ్రిది, షహీన్ లకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. 


Latest News
more

Trending
more