అంబానీ సంపాదనపై సంచలన నివేదిక




కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు, ఉపాది కోల్పోయారు. లాక్‌డౌన్ సమయంలో పేదలకు, ధనికులకు మధ్య చాలా అంతరాలు పెరిగిపోయాయి. ఇదే విషయాన్ని ఆక్స్‌ఫామ్ అనే సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తొలి రోజు ఈ నివేదికను విడుదల చేయగా దీనిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రపంచ కుబేరుల్లో ఒకడైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద గంటలకు రూ. 90 కోట్ల చొప్పున పెరిగిందని పేర్కొన్నది.

ఒక అన్‌స్కిల్డ్ కార్మికుడు కనీసం మూడేళ్ల పాటు సంపాదించి ఎంత కూడబెడతాడో.. ముఖేష్ అంబానీ ఒక సెకనులో అంత సంపాదించినట్లు ఆ నివేదికలో స్పష్టం చేసింది. అంబానీ అర్జించిన సంపదతో ఆరు నెలల పాటు ఇలాంటి సామాన్య కార్మికులు పేదరికంలో కూరుకొని పోకుండా కాపాడే అవకాశాలు ఉన్నాయని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. దేశంలో 24 శాతం మంది పేదలు నెలకు కేవలం రూ. 3వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారని.. అదే సమయంలో అంబానీ వంటి ధనవంతులు కరోనా సమయంలో కూడా వేల కోట్లు వెనకేసుకున్నారని ఆ నివేదిక తేల్చింది.

ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ధనవంతుల సంపద వేగంగా పెరిగిన దేశాల ప్రకారం ఇండియా ఆరో స్థానంలో ఉన్నది. మన కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ ఉన్నాయి. మన దేవంలోని 100 మంది ధనవంతుల సంపద కరోనా సంక్షోభ సమయంలో రూ. 12 లక్షల కోట్ల మేర పెరిగినట్లు నివేదిక చెప్పింది. వీరిలో తొలి 11 మంది కుబేరుల సంపాదనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని లేదా ఆరోగ్య శాఖను 10 ఏళ్ల పాటు సునాయాసంగా నిర్వహించవచ్చని పేర్కొన్నది.

మరోవైపు 100 మంది కుబేరులు మార్చి నుంచి సంపాదించిన మొత్తాన్ని కనుక దేశంలోని 13.8 కోట్ల మందికి పంచితే.. ఒక్కొక్కరికీ రూ. 94 వేలు ఇవ్వొచ్చని ఆ నివేదికలో తెలిపింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న పేద-ధనిక అంతరం ఇలాగే కొనసాగితే మున్మందు మరిన్ని సంక్షోభాలు చూడాల్సి ఉంటుందని ఆక్స్‌ఫామ్ తెలిపింది.


Latest News
more

Trending
more