మీ క్రెడిట్ కార్డు పోయిందా? ఎవరైనా కొట్టేశారా? అయితే.. వెంటనే ఇలా చేయండి!




ప్రస్తుతం మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. డెబిట్ కార్డులను మించిన లావాదేవీలు జరుగుతున్నాయి. బ్యాంకులు పిలిచి మరీ క్రెడిట్ కార్డులను అందిస్తున్న క్రమంలో చాలా మంది ఒకటికి మించి కార్డులు వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డును సక్రమంగా వినియోగించుకుంటే బోలెడన్ని లాభాలు అందుకోవచ్చు. అయితే, ఇదే సమయంలో క్రెడిట్ కార్డు మోసాలూ పెరిగాయి. చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్న సంఘటనలూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. క్రెడిట్ కార్డు ఎవరైనా కొట్టేయడం లేదా ఎక్కడైనా పోగొట్టుకుంటే వారు కచ్చితంగా కార్డును వెంటనే బ్లాక్ చేయాలి. లేదంటే అంది మోసగాళ్ల చేతిలోకి వెళ్తే నష్టపోవాల్సి వస్తుంది.

మీ క్రెడిట్ కార్డు పోయిందని మీరు నిశ్చయించుకున్న వెంటనే మీ బ్యాంకు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి తెలియజేయాలి. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అడిగిన సమచారం అందించడం ద్వారా మీ కార్డును బ్లాక్ చేస్తారు. 10 నిమిషాల్లో మీరు కార్డును బ్లాక్ చేసి మీ కార్డు దుర్వినియోగం కాకుండా కాపాడుకోవచ్చు.

నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ కార్డునూ బ్లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం నెట్ బ్యాంకింగ్ లోకి లాగిన్ అయిన తర్వాత అందులో కార్డు లేదా సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాతా లాస్ట్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్లాక్ రిక్వెస్ట్ ఎంచుకోవాలి. వెంటనే మీ కార్డు బ్లాక్ అవుతుంది. మరోవైపు.. కొన్ని బ్యాంకులు ఎస్ఎంఎస్ ద్వారా కూడా క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. మీ బ్యాంక్ ఈ సేవలు అందిస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి బ్లాక్ అని టైప్ చేసి మీ బ్యాంకు ప్రొవైడెడ్ నంబర్ కి మెసేజ్ చేస్తే సరిపోతుంది.
ఒక వేళ మీ మొబైల్, నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ ద్వారా మీ కార్డును బ్లాక్ చేయడం వీలుకాకపోతే వెంటనే మీ బ్యాంక్ బ్రాంచును సంప్రదించాలి. కార్డు పోయిన వివరాలను బ్యాంక్ అధికారులకు వివరిస్తే మీ కార్డును బ్లాక్ చేస్తారు. ప్రైవేట్ బ్యాంకు యూజర్లయితే సొంత బ్రాంచ్ కి వెళ్లాల్సిన పని లేదు. దగ్గర్లోని ఏ బ్రాంచ్ కి వెళ్లినా ఈ సేవలు పొందే వీలుంది.


Latest News
more

Trending
more