కోచ్ పదవికి జాఫర్ రాజీనామా.. మద్దతు పలికిన అనిల్ కుంబ్లే




భారత జట్టు మాజీ టెస్టు ఓపెనర్, సుదీర్ఘ కాలం పాటు దేశవాళీ క్రికెట్ ఆడిన వసీమ్ జాఫర్ రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ రంజీ టీమ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. సెలెక్టర్లు, అసోసియేషన్ కార్యదర్శి పక్షపాతం కారణంగా జట్టులోకి అనర్హులు ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేశారు. అనర్హులైన వారికి కోచింగ్ ఇచ్చి జట్టును ముందుకు నడిపించలేనని ఇది జట్టుకు మంచిది కాదని జాఫర్ ఆరోపించాడు.

మరోవైపు జాఫర్ ఒక మతానికి చెందిన వాళ్లను ప్రోత్సాహిస్తున్నాడని, బయోబబుల్‌లోకి మత గురువులను తీసుకొని వచ్చి ప్రార్థనలు చేయించాడని ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘ అధికారులు ఆరోపించారు. దీనిపై జాఫర్ స్పందించి.. తాను ఏనాడూ మతపరమైన విషయాలను క్రికెట్‌లోకి తీసుకొని రాలేదని చెప్పారు. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్‌గా చేయాలని తాను ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని.. తాను జై బిస్తాను కెప్టెన్ చేయమని రికమెండ్ చేసినట్లు చెప్పారు. సెలెక్టర్లే ఇక్బాల్‌ను కెప్టెన్‌గా చేయమని సూచించారని జాఫర్ అన్నాడు.

కాగా, బయోబబుల్‌లోకి మత గురువులను పట్టుకొని వచ్చిన విషయంపై వసీమ్ జాఫర్ స్పష్టతను ఇచ్చారు. 'డెహ్రాడూన్ శిబిరం సందర్భంగా 2-3 శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు. నేను ఆయనను పిలవలేదు. శుక్రవారం ప్రార్థనల కోసం ఇక్బాల్‌ అబ్దుల్లా నాతో పాటు మేనేజర్‌ అనుమతి కోరాడు. సాధన పూర్తయ్యాకే ప్రార్థనలు జరిగాయి' అని జాఫర్ చెప్పారు.

మరోవైపు వసీం జాఫర్ వివరణపై టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'వసీం జాఫర్‌ నా మ‌ద్ద‌తు నీకే. ఉత్త‌రాఖండ్ క్రికెట్ టీమ్ కోచ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌రైన‌దే. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్లేయ‌ర్స్ నీ కోచింగ్‌ను మిస్ అవుతారు' అని జంబో ట్వీట్ చేశారు.


Latest News
more

Trending
more