ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజీలాండ్




ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజీలాండ్ బెర్త్ సంపాదించింది. దీంతో ఫైనల్ చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం టెస్టు చాంపియన్‌షిప్‌లో విజయాల శాతం పరంగా న్యూజీలాండ్ (70) రెండో స్థానంలో ఉన్నది. ఇండియా 71.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా 69.2 శాతం, ఇంగ్లాండ్ 68.7 శాతంతో మూడు. నాలుగవ స్థానాల్లో ఉన్నాయి.

అయితే, అగ్రస్థానంలో ఉన్న ఇండియా కాకుండా న్యూజీలాండ్ ఎందుకు ఫైనల్‌కు వెళ్లిందనే అనుమానం అందరి వచ్చింది. దీనికి అసలు కారణం ఐసీసీ కొత్తగా రూపొందించిన పద్దతే. కరోనాకు ముందు పాయింట్ల ఆధారంగా స్థానాలు నిర్ణయించేవాళ్లు. అయితే కరోనా తర్వాత పాయింట్ల పద్దతిని పక్కకు పెట్టి విజయాల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. న్యూజీలాండ్ వరుసగా వెస్టిండీస్, పాకిస్తాన్‌లపై గెలిచి 70 శాతం విజయాలతో ఉన్నది. ఇక టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడే మ్యాచ్‌లు లేవు. దీంతో న్యూజీలాండ్ విజయాల శాతంలో ఎలాంటి మార్పులు ఉండవు.

కాగా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య టెస్టు సిరీస్ జరిగి ఉంటే న్యూజీలాండ్‌కు బెర్త్ దక్కే అవకాశం ఉండేది కాదు. అయితే దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడంతో న్యూజీలాండ్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది.

ఇక రెండో బెర్తు కోసం ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్య టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా కనీసం 2 విజయాలు సాధించాలి. అదే సమయంలో ఒక్క మ్యాచ్ అయినా డ్రా చేసుకోవాలి. అప్పుడు టీమ్ ఇండియా ఫైనల్ చేరే అవకాశం ఉంది. 4-0, 3-0, 2-0, 3-1, 3-0 తేడాతో సిరీస్ గెలిస్తే ఇండియా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ 2-2తో సిరీస్ డ్రా అయినా, 1-0, 2-0తో ఇంగ్లాండ్ గెలిచినా ఆసీస్ ఫైనల్ చేరుకుంటుంది. కాగా, ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ చేరాలంటే 4-0, 3-1, 3-0తో సిరీస్ గెలవాల్సి ఉంది.


Latest News
more

Trending
more