సచిన్ విషయంలో నీవన్నదే నిజం.. షరపోవా మమ్మల్ని క్షమించు.. క్రికెట్ అభిమానుల ట్వీట్లు




ఒక్క ట్వీట్ క్రికెట్ దేవుడు సచిన్‌ని అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఆహో ఓహో అంటూ పొగిడిన నోళ్లే.. ఇవాళ సచిన్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. రైతుల ఆందోళనల నేపథ్యంలో విదేశీ సెలబ్రిటీలు వారికి మద్దతుగా ట్వీట్లు చేశారు. దీనికి ప్రతిస్పందనగా.. సచిన్ టెండుల్కర్ ఇది మా దేశ అంతర్గత విషయం.. దీన్ని మేమే పరిష్కరించుకుంటాం.. ఇతరుల జోక్యం అవసరం లేదంటూ ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ట్వీట్‌తో క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు.

అంతే కాకుండా టెన్నిస్ క్రీడాకారిణి షరపోవాకు క్షమాపణలు చెబుతున్నారు. ఇంతకూ సచిన్ ట్వీట్ చేస్తే షరపోవాకు ఎందుకు క్షమాపణలు చెబుతున్నారనేగా మీ అనుమానం. దానికి ఒక కారణం ఉంది. 2014లో షరపోవా ఒకసారి సచిన్ టెండుల్కర్ అంటే ఎవరో నాకు తెలియదు అంటూ కామెంట్ చేసింది. దీంతో రెచ్చిపోయిన క్రికెట్ అభిమానులు ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు.

క్రికెట్ దేవుడే నీకు తెలియదా..? నీకు మరీ పొగరు ఎక్కువైంది అంటూ ఆగ్గి మీద గుగ్గిలం అయ్యారు. అయితే ఇప్పుడు దానికి రివర్స్ జరుగుతున్నది. షరపోవా ఆనాడు నువ్వు అన్నది నిజమే. నిన్ను అనవసరంగా ట్రోల్ చేశాము.. ఇప్పుడు మాకు కూడా సచిన్ ఎవరో తెలియదు.. అంటూ వేలాది మంది ట్వీట్లు చేశారు. అంతే కాకుండా ఆమె ఫేస్‌బుక్ పేజీకి వెళ్లి.. ఆ రోజు నిన్ను తిట్టినందుకు సారీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పుడు ట్విట్టర్‌లో షరపోవా సారీ అంటూ వేలాది ట్వీట్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ అయ్యింది.


Latest News
more

Trending
more